గిరిజన రైతుకు గోశాల చేయూత
– రెండు ఆవులు..ఒక ఎద్దు అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి: గత వారం తాండూరు నియోజకవర్గ పరిధిలోని బషీరాబాద్ మండలం బాద్లాపూర్ తండాలో పిడుగు పడడంతో అదే గ్రామానికి చెందిన గిరిజన రైతు మిట్టు నాయక్ పశువులు మృతి చెందిన విషయం తెలిసిందే. మూడు ఆవులు..రెండు ఎడ్లు పిడుగు పడి చనిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న తాండూరు గోశాల సేవా సమితి నిర్వాహకులు బాధిత రైతును ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. సోమవారం రాత్రి మిట్టు నాయక్ కు గోశాల తరపున రెండు ఆవులు..ఒక ఎద్దును ఉచితంగా అందించారు. గోశాల సహకారంపై గిరిజన రైతు మిట్టునాయక్ మాట్లాడుతూ.. ఎంతో ముద్దుగా పెంచుకున్న అవులు పిడుగుపడి మరణించడంతో తమ కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. గత వారం రోజులుగా ఇంట్లో వారు ఎవరు కూడా సరిగ్గా తినడం లేదని అన్నారు. అలాంటి సమయంలో తాండూరు గోశాల వారు రెండు ఆవులు..ఒక ఎద్దును ఉచితంగా ఇచ్చి ఆదుకోవడం సంతోషం అని రైతు మిట్టు నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో బాద్లాపూర్ తండా సర్పంచ్ భర్త పూల్ సింగ్, గోశాల అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, గోశాల ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్, గోశాల సంయుక్త కార్యదర్శి సంజయ్ సారడా పాల్గొన్నారు.

