ఆన్లైన్లో భూనక్ష..!
– భూములను డిజిటలైజ్ చేస్తున్న సర్కారు
– స్మార్ట్ ఫోన్లో కూడ చూసుకునే వెసులుబాటు
– భూసమస్యల పరిష్కారానికి చర్యలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలను పరిష్కరించేందుకు సర్కారు ప్రత్యేక దృష్టిసారిస్తోంది. సరికొత్త సాంకేతికతో భూములను డిజిటలైజ్ చేసేందుకు కసరత్తును కొనసాగిస్తోంది. భూ నక్ష కొత్త వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దీనిపై సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. గతంలోనే భూ సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించగా వివిధ కారణాలతో వాయిదా పడింది. తాజాగా సరికొత్త టెక్నాలజీతో భూ నక్ష పేరుతో భూముల సర్వేను చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు, మండలం, గ్రామాల వారిగా ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉందనే వివరాలను భూ నక్షలో పొందుపరుస్తున్నారు. దీంతో పాటు గతంలో హింది, ఉర్దూ, మరాఠలో ఉన్న సేత్వార్ వివరాలను తెలుగు, ఇంగ్లీష్లలో పొందుపరుస్తున్నారు. ఇప్పుడు ఈ వివరాలను ధరణి, ఆన్లైన్ వెబ్ సైట్లలో చూసుకునే విధంగా సాంకేతికతను అందుబాటులోకి తీసుకవస్తోంది. దీంతో ఎవరైనా, ఎక్కడ నుంచైనా సర్వే నెంబర్ లోకేషన్లను పరిశీలించుకోవచ్చు. గతంలో రికార్డులు ఎలా ఉన్నాయి. ఎవరి పేరుపై ఉన్నాయి, భూమి యజమాని వివరాలను చూసుకోవచ్చు.



