జాతీయ లోక్ అదాలత్‌లో 156 కేసుల రాజీ
– కేసులను పరిశీలించిన న్యాయమూర్తి టీ.స్వప్న
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిఫ్ కోర్టులో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 156 కేసులు రాజీ అయ్యాయి. ఆదివారం మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి టీ.స్వప్న ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కొనసాగింది. రాజీ కోసం వచ్చిన కేసుల వివరాలను న్యాయమూర్తి పరిశీలించారు. కొట్టివేతకు అస్కారం ఉన్న కేసులను న్యాయమూర్తి పరిష్కరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు కేసులకు సంబంధించి కక్షిదారులు తమ కేసులను రాజీ చేసుకున్నారు. రాజీ పడిన కేసులలో సీసీ(లోక్ అదాలత్) 54, సీసీ కేసులు 2, ఎంసీ కేసులు 8, డీవీసీ కేసులు 2, ఓ.ఎస్ కేసులు 10, ఎక్సెజ్ కేసులు 16, పీఎల్సీ కేసులు 3, నేరం ఒప్పుకోలు కేసులు 61 మొత్తం 156 కేసులు రాజీ అయినట్లు కోర్టు సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్, మహేందర్ రెడ్డి, లోక్ అదాలత్ మెంబర్లు శ్రీనివాస్ రెడ్డి, పి. రాంరెడ్డి, న్యాయవాదులు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. మరోవైపు మార్నింగ్ కోర్టులో 873 పిటి కేసులు పరిష్కారం అయ్యాయని కోర్టు ప్రతినిధులు తెలిపారు.



