విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్..

తెలంగాణ హైదరాబాద్

విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్..
ద‌ర్శిని ప్ర‌తినిధి : హైదరాబాద్‌లోని విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. విద్యార్థులకు బస్ పాస్ లను అందించనున్నట్లు ప్రకటించింది. అయితే బస్ పాస్‌ల జారీకి సంబంధించి కొత్త కండీషన్స్‌తో ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలోని 40 బస్ పాస్ జారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులకే గాక, ఎయిడెడ్ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు కూడా బస్ పాస్‌లు జారీ చేయనున్నారు. ఈ నెల 30వ తేదీ(సోమవారం) నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

టీఎస్ఆర్టీసీ చెందిన అధికారిక వెబ్ సైట్ online.tsrtcpass.in కు ఆన్ లైన్ లో దరఖాస్తును సమర్పించాలని అధికారులు సూచించారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి ఉదయం ఆరున్నర గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల 15 నిమషాల వరకు బస్ పాస్ కౌంటర్ల నుంచి పాస్ లను పొందవచ్చని తెలిపారు.

ఉచిత బస్ పాస్ కొసం 7వ తరగతి వరకు చదివే విద్యార్థులు, 18 ఏళ్ల లోపు వయస్సు లేదా 10 తరగతి వరకు చదువుతున్న బాలికలు టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారంను డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపారు. లేదా దగ్గర్లో ఉన్న బస్ పాస్ కౌంటర్ నుంచి దరఖాస్తును నేరుగా తీసుకుని.. హెడ్ మాస్టర్ సంతకం చేయించి దగ్గర్లో ఉన్న బస్ పాస్ కౌంటర్ లో సమర్పించాలని టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వి. వెంకటేశ్వర్లు తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగానూ విద్యార్థులకు ఇదే తరహాలో పాస్‌లను జారీ చేసేందుకు టీఎస్ ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.