టీఆర్ఎస్‌తో ఒరిగిందేమి లేదు
– తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు ఖాయం
– కేంద్రం నిధులతోనే రాష్ట్రాభివృద్ధి చేసిన సీఎం
– కుటుంబం కోసమే బంగారు తెలంగాణ
– బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
– అట్టహాసంగా ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ఒరిగిందేమి లేదని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు ఖాయమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర మొదటి విడత మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరులో అట్టహాసంగా ప్రారంభమైయ్యంది. తాండూరు పట్టణం నుంచి చేపట్టిన ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాజరై ప్రారంభించారు. ముందుగా తాండూరు పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద ప్రజా గోస – బీజేపీ భరోసా బైక్ యాత్రను డీకే అరుణ ప్రారంభించారు.
అనంతరం మున్సిపల్ పరిధిలోని రాజీవ్ కాలనీ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి బైక్ యాత్ర పెద్దేముల్ మండలం కందనెల్లి, మంబాపూర్, జనగాం, మారేపల్లి తో పాటు కోట్ పల్లి వరకు కొ నసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో డీకే అరుణ మాట్లాడుతూ దేశంలోని 18 రాష్ట్రా ల్లో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు హావా కొనసాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడ డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మోసపూరిత పాలన చేస్తున్నారని విమర్శించారు. నిధులు, నియామాకాలతో, అభివృద్ధితో బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పిన కేసీఆర్ కేవలం కుటుంబం కోసమే బంగారు తెలంగాణను నిర్మించుకున్నారని అన్నారు. కేంద్రం మంజూరు చేసిన నిధులతోనే తెలంగాణను అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డట్టే అన్నారు. కేంద్రం ద్వారా గ్రామాలు, పట్టణాలలో ఏర్పాటు చేసిన అంగన్వాడి కేంద్రాలు, సీసీ రోడ్లు, మౌళిక వసతుల ఏర్పాటుపై ప్రజల్లో ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర ద్వార చైతన్యం తీసుకువస్తామన్నారు. తాండూరు, పెద్దేముల్ మండలాల్లో చేపట్టిన యాత్రకు విశేష స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానందా రెడ్డి, మాజీ అధ్యక్షులు కరణం ప్రహాల్లాద్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు యు. రమేష్ కుమార్, పాండుగౌడ్, జిల్లా మహిళ మోర్చ అధ్యక్షురాలు సాహు శ్రీలత, బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, పెద్దేముల్ మండల అధ్యక్షులు సందీప్, తాండూరు మండల అధ్యక్షులు శేఖాపురం ఆంజనేయులు, కౌన్సిలర్లు అంతారం లలిత, బంటారం లావణ్య, కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, నాయకులు పూజారి పాండు, అనంతయ్య ముదిరాజ్, రజనీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.


