సర్కారు వైద్య సేవలకు ఆదరణ
– త్వరలోనే ఖాళీల భర్తీ పూర్తి
– మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు కూడ
– టీవీవీపీ కమీషనర్ డా.జే. అజయ్ కుమార్ వెల్లడి
– తాండూరు ఎంసీహెచ్, జిల్లా ఆసుపత్రి సందర్శన
– ఎంసీహెచ్ రికార్డుల నిర్వహణపై అసంతృప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు దవాఖానల్లో వైద్య సేవలకు అందరి ఆదరణ పెరుగుతుందని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కమీషనర్ డా.జే. అజయ్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం వికారాబాద్ జిల్లా తాండూరులోని మాతాశిశు సంరక్షణ ఆసుపత్రి(ఎంసీహెచ్) తో పాటు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని కమీషనర్ డా.జే. అజయ్ కుమార్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఆసుపత్రులు మెరుగు పడుతున్నాయన్నారు. సర్కారు దవఖానాల్లోనే అధిక ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. సీజరియన్ కంటే సాధారణ ప్రసవాలపై దృష్టిసారించడం జరుగుతుందన్నారు. కార్పోరేట్‌కు ధీటుగా అందిస్తున్న సేవలతో పేదలకు వైద్యం మరింత చేరువ అవుతుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియతో రాష్ట్రంలోని దవఖానల్లో ఖాళీలు అన్ని భర్తీ అవుతాయని అన్నారు. కంటి వైద్యులు, వంటి వైద్యులు, ఆర్థో తదితర విభాగాల వైద్య పోస్టులు భర్తీ జరుగుతాన్నారు. దీంతో పాటు పలు ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే ఎంపీహెచ్ ఆసుపత్రిలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. అదేవిధంగా పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో కిడ్నీ రోగులకు అందించే సేవలను విస్తరించేందుకు దృష్టిసారిస్తున్నామన్నారు. రక్తనిధి కేంద్రంలో సమస్యలను పరిష్క రిస్తామన్నారు. నిర్మాణ్ సంస్థ ద్వారా చేపడుతున్న ఐసీయూ కేంద్రాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసువకచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.
రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు
అంతకుముందు టీవీవీపీ కమీషనర్ డా.జే. అజయ్ కుమార్ ఎంసీహెచ్ లో మహిళ ఓపి, పిల్లల విభాగం, ప్రసూతి విభాగం, ఆపరేషన్ థియేటర్, నవజాత శిశు కేంద్రం తదితర విభాగాలను పరిశీలించారు.
ఆసుపత్రిలో అందిస్తున్న సేవలపై రోగులను, బంధువులను అడిగి తెలుసుకున్నారు. డబ్బులు వసూలు చేస్తున్నారా.. మందుల కోసం బయటకు పంపిస్తున్నారా అని ఆరా తీశారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చేరిన రోగులకు సంబంధించి కేసీట్ రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డుల నిర్వహణలో ఆశ్రద్దగా ఉంటే కఠిన ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు, బందువులకు, చిన్నారులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. మహిళలను ప్రసవాల కోసం తీసుకవచ్చే ఆశా వర్కర్లకు ఆసుపత్రిలో వసతి, భోజన సదుపాయం కల్పించాలని సూపరిండెంట్ డా.రవిశంకర్ కు సూచించారు. అక్కడి నుంచి పంటగది పరిశీలించి.. జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఈ కార్యక్రమంలో వైద్య విధాన పరిషత్ జిల్లా సమన్వయ కర్త డా. ప్రదీప్, ఎంసీఎచ్ నోడల్ ఆఫీసర్ లలిత కుమారి, హెచ్ డీసీ మెంబర్ డా.రమణబాబు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారు.



