కొత్త మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్
– అనుమతులు మంజూరు చేసిన సర్కారు
– 8 జిల్లాలలో కాలేజీల ఏర్పాటు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 8 జిల్లాలలో కొత్తగా మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వైద్యారోగ్యశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 8 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు, అనుబంధ ఆస్పత్రుల అప్‌గ్రేడేషన్‌కు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడగానే మొదటి విడతగా ప్రభుత్వం 4 కొత్త వైద్య కళాశాలలు మహబూబ్ నగర్ , నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేటలో ప్రారంభించింది. దీంతో ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడంతో పాటు, ఈ కళాశాలల్లో వైద్య విద్యా బోధన విజయవంతంగా జరుగుతున్నది. రెండో విడుతగా మరో 8 వైద్య కళాశాలలను మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిల్లో ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, జనగాం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటుకానున్నాయి. ప్రతి కాలేజీలో వంద ఎంబీబీఎస్ సీట్లు ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, కొత్త కాలేజీ ఏర్పాటు కోసం రాజన్న సిరిసిల్లకు రూ.166కోట్లు, వికారాబాద్‌కు రూ.235కోట్లు, ఖమ్మానికి రూ.166కోట్లు, కామారెడ్డికి రూ.235కోట్లు, కరీంనగర్‌కు రూ.150కోట్లు, జయశంకర్ భూపాలపల్లికి రూ.168కోట్లు, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్‌కు రూ.169కోట్లు, జనగామకు రూ.190కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. టోటల్‌గా 8 మెడికల్ కాలేజీల కోసం 1479 కోట్ల రూపాయలను అటాచ్ చేసింది. అయితే
మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణ బాధ్యతను ఆర్అండ్బీ శాఖకు, ఆసుపత్రి భవనాల అప్‌గ్రేడింగ్, పరికరాలు, ఫర్నిఛర్ కొనుగోలు బాధ్యతను టీఎస్ఎంఎస్ఐడీసీకి అప్పగించారు. వైద్య విధాన పరిషత్‌లోని ఆసుపత్రులకు అనుసందానం చేసిన మెడికల్ కాలేజీలను ఇకనుంచి డీఎంఈ అండర్‌లోకి ట్రాన్స్ఫర్ చేసింది ప్రభుత్వం.



