తిమ్మపూర్ కారు ఘటనలో డ్రైవర్ సేఫ్..
– భయపడి తలదాచుకున్న వైనం
దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తిమ్మాపూర్ కారు గల్లంతు ఘటనలో డ్రైవర్ సేఫ్గా ఉన్నట్లు సమాచారం. రావులపల్లి గ్రామానికి చెందిన నవాజ్ రెడ్డి ఆదివారం సాయంత్రం అత్తారింటి నుంచి కారులో వస్తుండగా అతని భార్య ప్రవళిక, అక్కలు శ్వేత, రాధ, అల్లుడు శశాంక్ రెడ్డి, డ్రైవర్ రాఘవేందర్ రెడ్డితో పాటు వాగులో గల్లంతు అయిన విషయం తెలిసిందే. అదేరోజు రాత్రి నవాజ్ రెడ్డి, అక్క రాధ ప్రాణాలతో బయట పడగా సోమవారం ఉదయం భార్య ప్రవళిక, అక్క శ్వేతల మృతదేహాలు బయటపడ్డాయి. అయితే ఈ ప్రమాదంలో గల్లంతు అయిన కారు డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రే ప్రాణాలతో బయటపడిన తరువాత తనను ఎవరైనా ఏమైనా అంటారేమోననే భయంతో ఎక్కడికో వెళ్లిపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చివరకు అతను చేరాల్సిన చోటులో సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు కారు గల్లంతు ఘటనలో నవాజ్ రెడ్డి అల్లుడి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా తిమ్మాపూర్ కారు గల్లంతులో డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


