పేదలపై లయన్స్ క్లబ్ చల్లని చూపు
– ఉచిత కంటి వైద్య శిబిరంలో పరీక్షలు
– అపరేషన్ కోసం హైదరాబాద్‌కు 14 మంది తరలింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు లయన్స్ క్లబ్ పేదలపై చల్లని చూపు చూస్తోంది. ఉచిత కంటి వైద్య శిబిరంతో కంటి సమస్యలను దూరం చేస్తూ వెలుగులు నింపుతోంది. కొన్ని నెలలుగా ప్రతి వారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సాధూరాం కంటి ఆసుపత్రి వారి సహాకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తుంది. గత వారం నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో 16 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించి వారిని సొంత ఖర్చులతో హైదరబాద్‌కు తరలించి.. ఆపరేషన్లు చేయించి తిరిగి తీసుకవచ్చింది. తాజాగా గురువారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 25 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో కూడ 14 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. కంటి పరీక్షల కోసం వచ్చిన వారికి డాక్టర్ సతీష్ బాబు సహాకారంతో అన్నదానం చేశారు.

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు జహీర్ అహ్మద్, రొంపల్లి సంతోష్ కుమార్‌లు మాట్లాడుతూ పేదలకు సేవ చేయడంలో లయన్స్ క్లబ్ ముందుంటుందన్నారు. పేదలు చిరస్థాయిగా గుర్తించుకునే సేవలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో ఉచిత కంటిపరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆపరేషన్లు అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తున్నామన్నారు. ఇంకా కంటి సమస్యలు ఉన్న వారు లయన్స్ క్లబ్ కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా గురువారం జరిగిన కంటి వైద్య శిబిరంలో అపరేషన్లు అవరమైన 14 మంది బాధితులను హైదరాబాద్‌కు తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు సల్ల దామోదర్, ఓం ప్రకాష్ సోమని, నూతన సభ్యులు వీరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


