గో.. గో.. గణేషా..!
– తాండూరులో ప్రశాంతంగా నిమజ్జనం
– శోభాయాత్రతో తరలిన వినాయకులు
– కోకట్ కాగ్నావద్ద పకడ్బందీ ఏర్పాట్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి: మొదటి రోజు జై జై గణేషా అంటూ వినాయకున్ని పూజించిన భక్తులు తాండూరులో ఐదో నిమజ్జనం రోజున గో.. గో. గణేషా అంటూ సాగనంపారు. ఆదివారం తాండూరులో వినాయక నిమజ్జనం ప్రారంభమయ్యింది. ఈ సారి యాలాల మండలం కోకట్ కాగ్నానది వద్ద వినాయకుల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ అధ్వర్యంలో అధికారులు పడకడ్బందీ చర్యలు తీసుకున్నారు.

ప్రత్యేక క్రేన్ల ద్వారా వినాయకుల నిమజ్జనం చేస్తున్నారు. అంతకుముందే ఆర్డీఓ అశోక్ కుమార్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తాండూరు పట్టణంలో వివిధ మండపాలలో ప్రతిష్టించిన వినాయకులకు ఆఖరి పూజలు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు. శోభాయాత్ర ద్వారా వినాయకులను ఊరేగించారు.

ఆట పాటలతో.. బ్యాండ్ దరువులతో ఊరేగింపు శోభాయామానంగా ముందుకు సాగింది. ఊరేగింపుగా వచ్చిన వినాయకులను యాలాల మండలం కోకట్ గ్రామ కాగ్నానదికి తరలించి వినాయకులను నిమజ్జనం చేశారు.


