అంతా హ‌డావుడి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అంతా హ‌డావుడి..!
– మంత్రి హ‌రీష్ రావు ప‌ర్య‌ట‌న‌లో అత్యుత్స‌హాం
– మంత్రి ముందే హోరెత్తిన వ‌ర్గ‌ నినాదాలు
– శంకుస్థాప‌న కార్యక్రమాలకు అడ్డంకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ప‌ట్ట‌ణంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప‌ర్య‌ట‌న అంతా హ‌డావుడిగా ముగిసింది. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాండూరులో కొనసాగిన పర్యటనలో నేతలు, కార్యకర్తల అత్యుత్సాహం వ‌ల్ల హ‌డావుడికి దారి తీసింది. మంత్రి హరీష్ రావు రాగానే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు నినాదాలతో హోరెత్తించారు. పట్టణంలోని గంగోత్రి పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు పనుల శంకుస్థాపన వద్ద శిలాఫలకంపై తమ పేరును వేయలేదంటూ మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు మంత్రి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. శంకుస్థాపన అనంతరం మంత్రి హరీష్ రావు కారును పట్లోళ్ల రత్నమాల అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులు, స్థానిక నేతలు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో అక్కడి నుంచి మంత్రి కారు ముందుకెళ్లింది. అదేవిధంగా పాత తాండూరులో బస్తీ దవఖాన వద్ద కూడ సేమ్ సీన్ రీపీట్ అయ్యింది. ఫ్లోర్ లీడర్ శోభారాణి తమకు గౌరవం ఇవ్వలేదని మంత్రి ముందు ఆవేధన తెలిపేందుకు యత్నించారు. అదేవిధంగా అక్క‌డే ఉన్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గీయులు ఎవరి వర్గానికి వారు అనుకూలంగా నినాదాలు చేయడంతో మంత్రి హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. పద్ధతిగా నడుచుకోకపోతే బాగోదంటూ మంత్రి హరీష్ అన్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని ఆదేశించడంతో పరిస్థితి సద్దుముణిగింది. ఈ పరిణామాల తరువాత మంత్రి హరీష్ రావు తన పర్యటన కార్యక్రమాలను హడావుడిగా పూర్తి చేశారు.