పిల్లల ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి
– నులి పురుగుల నివారణ మాత్రలు వేయించాలి
– మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేందుకు తల్లిదండ్రులు శ్రద్ద వహించాలని తాండూరు మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. గురువారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరరించుకుని గాంధీనగర్‌లోని ప్రాథమిక పాఠశాల, అంగన్ వాడి కేంద్రంలోని చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు నులి పురుగుల వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని తెలిపారు. పోషకారలోపం, మానసిక సమస్యలు, శారీరక ఎదుగుదల లోపాలు పిల్లలపై ప్రభావం చూపుతాయన్నారు. పిల్లలు ఇలాంటి సమస్యల బారిన పడకుండా దృష్టిసారించాలని అన్నారు. ముఖ్యంగా పిల్లల్లో నులి పురుగుల సమస్యలు రాకుండా మూడేళ్ల లోపు పిల్లలకు ఆల్బెండజోల్ సగం మాత్ర, ఆపైబడిన వారికి ఒక మాత్ర వేయాలని సూచించారు. దీంతో పాటు మంచి పౌష్టికాహారాన్ని అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రాదా, ఏఎన్ఎం శాంత, ఆశా వర్కర్ సుజాత, ఆయమ్మ భీమమ్మ, కాలనీవాసులు పాల్గొన్నాన్నారు.


