డ్రామాలను మానుకోండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

డ్రామాలను మానుకోండి..!
– త్వరలోనే తాండూరకు మంచిరోజులు
– కోర్టు ఉత్తర్వులతోనే సమ్మె విరమణ
– 29న ప్రభుత్వం ముందు హాజరు తప్పదు
– తాండూరు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలను మభ్యపెట్టే డ్రామా రాజకీయాలను మానుకోవాలని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్, వర్గం నేతలను ఉద్దేశించి తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ వ్యాఖ్యలు చేశారు. శనివారం వారి నివాసంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మీడియాతో మాట్లాడుతూ కార్మికుల సమ్మె విషయంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్, వర్గం సభ్యులు కార్మికులను, ప్రజలను తప్పుదోవ పట్టించారని అన్నారు. కార్మికుల పీఆర్సీ విషయంలో కోర్టులో ఫిటిషన్ వేయగా 22న కోర్టు ఉత్తర్వులు రావడంతో అదే రోజు హైడ్రామాలు చేసి కార్మికుల సమ్మెను విరమింప జేశారని అన్నారు. పరిస్థితులను అనుకూలంగా చేసుకుని తనపై దుమ్మెత్తి పోసే కార్యక్రమానికి తెరలేపారని అన్నారు. ఎన్ని డ్రామాలు చేసిన బూటకపు రాజకీయాలు చెల్లవని అన్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈనెల 29న ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్, చైర్ పర్సన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముందు హాజరుకావాల్సిందే అని స్పష్టం చేశారు. దీనిని అతిక్రమిస్తే కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు. అందులో కూడ ఏమైనా అక్రమాలకు పాల్పడితే న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ వర్గానికి చెందిన మెజార్టీ కౌన్సిలర్లు, నేతలు ఆమోదంతోనే చైర్ పర్సన్ పదవి పొందడం జరిగిందని, ఇందులో ఓ వర్గం వల్లో.. ఓ నేత వల్లో కాలేదని అన్నారు. ప్రతిపక్ష కౌన్సిలర్లతో కలిసి బడ్జెట్ సమావేశాన్ని అడ్డుకుని అభివృద్ధిని అడ్డుకుంది మీరు కాదా అని ప్రశ్నించారు. 30 ఏండ్లుగా రాజకీయాల్లో ఉంటే వర్షాలు పడితే సాయిపూర్‌కు అన్ని కష్టాలు ఎందుకు వస్తాయో చెప్పాలన్నారు. చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసేది లేదని… కొందరు కాదన్న చట్టం ప్రకారం చైర్ పర్సన్‌ తనే అని చెప్పుకొచ్చారు. త్వరలోనే తాండూరకు మంచిరోజులు వస్తాయని అన్నారు. ఇప్పటికైనా డ్రామాలు మానుకోవాలని సూచించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ వర్గం నుంచి తమను దూరం చేసేందుకే ఎమ్మెల్యే వర్గం నేతలు కుట్రలు చేస్తున్నారని చైర్ పర్సన్ భర్త పరిమళ్ గుప్త ఆరోపించారు. ఇందులో భాగంగానే తనపై కేసులు నమోదు అయ్యేలా చేశారని అన్నారు. ఏదేమైనా చైర్ పర్సన్‌ పదవి విషయం అధిష్టానం చూసుకుంటుందని, తుది నిర్ణయానికే కట్టుబడి ఉంటామన్నారు. చిల్లర విమర్శలకు బదులిచ్చే అసవరం మాకు లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్ రాము, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.