రోడ్డుపై నోట్ల కట్టలు ..!
– పడేసి పారిపోయిన ఏటీఎం దొంగలు
– చిత్తు కాగితాలు అనుకున్న ప్రజలు
– వైరల్ గా మారిన జగిత్యాల సంఘటన
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: అవును మీరు చదివింది నిజమే. రోడ్డుపై నోట్ల కట్టలు జారి పడ్డాయి. చిమ్మ చీకటి కావడంతో ప్రజలు చిత్తు కాగితాలు అనుకుని పట్టించుకోలేదు. ఏటిఎం చోరీకి పాల్పడిన దొంగలు పోలీసుల రాకతో దాదాపు 3 లక్షల విలువైన ఈ నోట్ల కట్టలను రోడ్డుపై వదిలేసి పారిపోయారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన ఈ సంఘటన వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో అర్థరాత్రి ఒంటిగంటకు గుర్తు తెలియని నలగురు వ్యక్తులు కారులో వచ్చి రోడ్డుపై ఉన్న ఎస్బిఐ ఏటీఎంలోకి చొరబడ్డారు. ఎటీఎంను బద్దలుకొట్టి చోరీ చేశారు. డబ్బాల్లో నగదు తీసుకుని తమ కారులో పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా దొంగలు కంటపడటంతో.. పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో దొంగలు పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో దొంగలు నగదు బాక్స్‌ను పడేసి వెళ్లిపోయారు. దీంతో నోట్ల కట్టలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. రోడ్డుపై వరుసగా పడిన నోట్లను ప్రజలు సైతం పట్టించుకోలేదు. చిత్తు పేపర్లుగా భావించి లైట్ తీసుకున్నారు. అయితే, పోలీసులు బ్యాంకు అధికారులకు సమాచారం అందించి, రోడ్డుపై పడిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 3 లక్షలకు పైగా విలువైన నోట్లు రోడ్డుపై చిందరవందరగా పడ్డాయి. ఎస్బిఐ ఏటీఎంలో డబ్బు చోరీకి ప్రయత్నించింది నలుగురు దొంగల ముఠాగా పోలీసులు నిర్ధారించారు. గ్యాస్కట్టర్లతో ఏటీఎంని కట్ చేసి రూ.19 లక్షల సొమ్మును కాజేశారు. వాళ్లను పట్టుకునేందుకు సినీ ఫక్కీలో చేజ్ చేశారు పోలీసులు. దొంగలను అదుపులోకి తీసుకుని, వారు దోచుకున్న డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే, మరికొందరు దొంగలు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

