కంటి వెలుగు 2.0 సూపర్ సక్సెస్
– తాండూరులో తొలి రోజు 456 మందికి కంటి పరీక్షలు
– 146 మందికి అద్దాలు పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : అంధత్వ నియంత్రణ కోసం తెలంగాణ సర్కారు ప్రారంభించిన కంటి వెలుగు 2.0 తాండూరులో సూపర్ సక్సెస్ అయ్యింది. కార్యక్రమంలో భాగంగా తాండూరు మున్సిపల్ పరిధిలో 3 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. గురువారం నుంచి పట్టణంలో కంటి వెలుగు శిబిరాలు ప్రారంభం అయ్యాయి. పట్టణంలోని వార్డు నెంబర్ 7 ఎన్టీఆర్ కాలనీలో, వార్డు నెంబర్ 17కు సంబంధించి పాత తాండూరు బస్తీ దవాఖానలో, వార్డు నెంబర్ 33కు సంబంధించి కన్యా పాఠశాల వద్ద కంటి వెలుగు వైద్య పరీక్షల శిబిరాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలను నిర్వహించారు. ప్రతి రోజు 150 మందికి పరీక్షలను నిర్వహించాలని లక్ష్యం ఉండగా అందుకు అనుగుణంగా పరీక్షలు జరిగాయి. తాండూరులోని మూడు శిబిరాలలో మొదటి రోజు 456 మంది కంటి పరీక్షలు నిర్వహించారు. 146 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. వార్డు నెంబర్ 7లో 153 మందికి పరీక్షలు చేయగా 63 మందికి కంటి అద్దాలను అందజేశారు. వార్డు నెంబర్ 17లో 147 మందికి పరీక్షలు చేయగా 42 మందికి అద్దాలను పంపిణీ చేశారు. దీంతో పాటు వార్డు నెంబర్ 33లో 150 మందికి పరీక్షలు నిర్వహించగా 41 మందికి కంటి అద్దాలను అందజేశారు. ఇతర సమస్యలు ఉన్న వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అయితే ముందుగానే దాదాపు 400 మంది వివరాలను ఆన్లైన్లో నమదు చేయగా గురువారం ప్రారంభమైన శిబిరాలలో ఆఫ్లైన్ కింద పై వివరాలు నమోదైనట్లు శిబిరాల సూపర్ వైజర్లు తెలిపారు.

