ఆర్డీఓకు కొత్త చిక్కులు..!
– ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
– జిల్లా కలెక్టర్కు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి, తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్కు కొత్త చిక్కు వచ్చింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని తాండూరు మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి వికారాబాద్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామం తాండూరులో తీవ్ర చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా మున్సిపల్ ఆధ్వర్యంలో పాత తాండూరు అంబేద్కర్ పార్కులో ఆర్డీఓ అశోక్ కుమార్ గమనించకుండా జాతీయ జెండాను తలక్రిందులుగా ఎగురవేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర దుమారమైంది. ఈ సంఘటనపై మున్సిపల్ పరిధి 13వ వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి వికారాబాద్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జాతీయ పతాకం పట్ల ఆర్డీఓ అశోక్ కుమార్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా జాతీయ జెండాను తలక్రిందులుగా ఎగురవేసి అవమాన పరిచారని అభిప్రాయపడ్డారు. కావున ఆర్డీఓపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదును అందజేశారు.


