అంత ఈజీ కాదు..!
– న్యాయం కోసం హైకోర్టులో పిటిషన్
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– అవిశ్వాసంపై ట్విస్ట్ ఇచ్చిన చైర్ పర్సన్
తాండూరు, దర్శిని ప్రతినిధి: మున్సిపల్ చైర్ పర్సన్ పదవి నుంచి తొలగించడం అంత ఈజీ కాదని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అభిప్రాయ పడ్డారు. కొందరు చేసినా ప్రలోబాలు ఏమాత్రం పారే అవకాశం లేదని ధీమా వ్యక్తం చేశారు. తనపై అవిశ్వాస తీర్మానంపై ఆమె కొత్త ట్విస్ట్‌ను ఇచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ పదవి కాలం మూడేళ్లు ముగియడంతో అవిశ్వాసం పెట్టాలని కౌన్సిలర్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు నివేధిక అందించిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు అవిశ్వాసం తీర్మానంపై హైకోర్టు స్టే విధించిందని మంగళవారం తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ చైర్ పర్సన్ ఎలక్షన్ ఇన్ కాన్సిట్యూషన్ ఆఫ్ ఇండియా అనుసరించి జరుగుతుందన్నారు. దానికి ఏ రూల్స్లతో తొలగించలేరన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పురపాలికల్లో ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా పాలన చేస్తుందన్నారు. దానిని మరింత బలోపేతం చేసేందుకు మున్సిపల్ చట్ట సవరణ చేసిందన్నారు. ఇందులో మున్సిపల్ చైర్ పర్సన్ పై మూడేళ్లకు కాకుండా నాలుగేళ్లకు అవిశ్వాసం పెట్టాలనే అంశం ఉందన్నారు. దీనికి ఆమోద ముద్ర రావడంలో ఆలస్యం జరిగిందని అన్నారు. అయితే మున్సిపల్ చైర్ పర్సన్‌పై మూడేళ్లకు అవిశ్వాసం పెట్టాలనే అంశాన్ని అసరా చేసుకుని కొందరు అవిశ్వాసం తీర్మానం చేశారని అన్నారు. ప్రలోభాలకు సైతం గురిచేశారని ఆరోపించారు. తనపై వేసిన అవిశ్వాసాన్ని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. ఈ విషయంలో న్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పారు. రేపో.. ఎల్లుండో ఉత్తర్వులు వస్తాయని స్పష్టం చేశారు.

