భూకైలాస్లో శివపార్వతుల కళ్యాణ వైభోగం
– పల్లకి సేవను ఊరేగించిన శంకర్ నాయక్, వాసు నాయక్
– ఆకట్టుకున్న శివస్వాములు ప్రదర్శనలు
– అంగరంగ వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం తాండాలో వెలసిన భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాల దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణ వైభోగం విరాజిల్లింది. భూకైలాస్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం కూడా అంగరంగ వైభవంగా కొనసాగాయి. ప్రతి యేడాది మాదిరిగానే శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు.

ఉదయం శివపార్వతుల పల్లకి సేవ ఊరేగింపు నిర్వహించి, మధ్యాహ్నం వేళ శివపార్వతుల విగ్రహాలను ఊరేగింపు నిర్వహించారు. శంకర్ పవార్ నాయక్, శాంతి పవార్, వాసుపవార్, ఇందిరాపవార్, శాంతిపవార్ దంపతులు కళ్యాణోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. ఊరేగింపు ముందు శివస్వాముల కత్తి విన్యాస ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

అదేవిధంగా ఊరేగింపులో శంకర్ నాయక్ చేసిన నృత్యాలు రంజింప జేశాయి. బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో భూకైలాస్ భక్త జనసందోహమైంది. తాండూరుతో పాటు వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణ పేట్, కర్ణాటక రాష్ట్రాల భక్తుల తాకిడితో కిటకిటలాడింది. భూకైలాస్ సొరంగమార్గంలో వెలసిన నీటిగుండ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి దర్శించుకున్నారు.

