ఇంటి వద్దకే సీతారాముల కళ్యాణ తలంబ్రాలు

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ఇంటి వద్దకే సీతారాముల కళ్యాణ తలంబ్రాలు
– రూ. 116లతో ఆర్టీసీ ద్వారా హోం డెలివరీ
– భక్తులకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ఎంతో విశిష్టమైన భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకు చేర్చే కార్యక్రమాన్ని తెలంగాణ ఆర్టీసీ చేపట్టింది. రూ. 116లతో పార్సిల్‌ ద్వారా ఇంటికి చేర్చే శుభవార్తను భక్తులకు అందించింది. భద్రాద్రి రామయ్య సీతాదేవిల కళ్యాణాన్ని కనులారా చూడాలని ఎంతోమంది భక్తులు ఆశపడతారు. కళ్యాణోత్సవంలో తలంబ్రాలకు ఎంతో విశిష్టత దాగి ఉంది. ఎంతో మంది భక్తులు నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా కళ్యాణంలో ఉపయోగిస్తున్నారు. ఎంతో విశిష్టమైన ఆ కళ్యాణ తలంబ్రాలను ఇంటికి తెచ్చుకోవాలని భక్తులు తపిస్తారు. కానీ పలు కారణాల వల్ల కొందరికి ఆ అవకాశం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఇంటి వద్దకే భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాలను తీసుకవచ్చేలా చర్యలు చేపట్టింది. దీనికోసం రూ.116 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సేవలను పొందాలనుకునేవారు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగ ఫోన్‌ నంబర్లు 9177683134, 7382924900, 9154680020 సంప్రదించాలని TSRTC ఎండీ సజ్జనార్‌ సూచించారు. వివరాలు నమోదు చేసుకున్న భక్తులకు తలంబ్రాలను టీఎస్‌ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుందని తెలిపారు. శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవలను వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు.