వచ్చేస్తున్నాయ్.. డబుల్ బెడ్ రూం ఇండ్లు..!
– పంపిణీకి కసరత్తు చేస్తోన్న అధికారు యంత్రాంగం
– తాండూరులో 581 యూనిట్ల నిర్మాణం పూర్తి
– అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ ప్రాంత వాసులకు ఇది శుభవార్తే. ఏన్నో ఏండ్లుగా సొంతింటి కల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లను అందించేందుకు అధికార యంత్రాంగం కసరత్తును ప్రారంభించింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పేదల నుంచి దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపికకు ప్రక్రియను ముమ్మరం చేశారు. పూర్తయిన యూనిట్లలో మైనర్ పనులన్నీ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. తాండూరు పట్టణ పరిధిలో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన చేపట్టిన 1,050 యూనిట్ల నిర్మాణంలో తాండూరు పట్టణానికి సంబంధించి 428 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించాల్సి ఉండగా.. 581యూనిట్ల నిర్మాణం పూర్తయింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పేదల నుంచి దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపికకు ప్రక్రియను కూడ ముమ్మరం చేశారు. పూర్తయిన ఇళ్లకు హౌస్ వైరింగ్, ప్లంబింగ్ పనులను చేయాల్సి ఉంది. పెండింగ్ పనులను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసేలా ప్రభుత్వం వారం రోజుల్లో మార్గదర్శకాలను తహసీల్దార్లకు పంపించనుంది. వచ్చే సోమవారం నుంచి వారం పాటు దరఖాస్తులు స్వీకరించాలని, మరో వారం విచారణ జరిపి తుది లబ్ధిదారుల ఎంపిక చేయలని తహసీల్దార్లకు ఆదేశాలందాయి. మొదట ఇళ్లు పేదలకే ప్రాధాన్యం ఇస్తూనే అర్హుల దరఖాస్తులు ఎక్కువ వస్తే లాటరీ విధానంలో ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ నెల రోజుల్లో పూర్తిచేసేందుకు నిర్ణయించారు.
ఆదేశాలు అందాయి : తహసీల్దార్ చిన్నప్పలనాయుడు
వారం, పదిరోజుల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు అందాయి. చేపట్టిన యూనిట్లలో మిగిలిన పనులన్నీ పూర్తి చేసి నివాస యోగ్యానికి ఇళ్లు సిద్ధం చేసి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. మైనర్ పనులన్నీ పది రోజుల్లో పూర్తి చేసి ఎంపిక, కేటాయింపు ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేస్తాం.మొదట తాండూరు అర్బన్‌లో పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

