‘ప్రత్యక్షం’గా అప్రమత్తం..!

కెరీర్ తాండూరు తెలంగాణ వికారాబాద్ హైదరాబాద్

‘ప్రత్యక్షం’గా అప్రమత్తం..!
– పరీక్షా కేంద్రాలను సందర్శించిన అధికారులు
– పరిశీలించిన డీఆర్‌ఓ, డీఈఓ, డీఎస్పీ
– కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వాట్సాప్‌లో పదో తరగతి ప్రశ్నా పత్రం ప్రత్యక్షమైన ఘటనపై జిల్లా అధికార యంత్రాంగం అలెర్ట్ అయ్యింది. రెండో రోజు పరీక్షలు కొనసాగుతున్న కేంద్రాల వద్ద అధికారులు ప్రత్యక్షమయ్యారు. పరీక్ష నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించారు. సోమవారం మొదటి రోజు తాండూరు పట్టణంలోని పదో తరగతి పరీక్షా కేంద్రం ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాల నుంచి తెలుగు పరీక్షా ప్రశ్నాపత్రం వాట్సాప్ లో ప్రత్యక్షమైన సంఘటన అందరికి తెలిసిందే.

సోషల్ మీడీయాలో వైరల్ అయిన సంఘటనపై ఇందుకు ప్రధాన కారకులు అయిన రిలీవర్, అదే స్కూల్ టీచర్ బందెప్పతో పాటు డీఓ శివకుమార్, సీఎస్ గోపాల్, మరో టీచర్ సమ్మప్పలను సప్సెండ్ చేయడం.. ఇన్విజిలేటర్ శ్రీనివాస్ పై సమగ్ర విచారణకు ఆదేశించిన సంగతి కూడా విధితమే. రెండో రోజు పరీక్ష నిర్వహణలో మళ్లీ అలాంటి తప్పు జరగకూడదని అధికారులు జాగ్రత్త పడ్డారు.

పరీక్షా కేంద్రాలను సందర్శించిన అధికారులు
పట్టణంలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను అధికారులు సందర్శించారు. ఉదయం 9-30 గంటల తరువాత నుంచి పరీక్షా ముగిసే సమయం వరకు అధికారులు ఒక్కొక్కరుగా కేంద్రాలను సందర్శించి సమీక్షించారు. పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి, తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడుతో కలిసి సందర్శించారు.

అదేవిధంగా జిల్లా విద్యాధికారి రేణుకా దేవి కూడా పరీక్షా కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులు పరీక్షలు రాస్తున్న గదులను తనిఖీ చేశారు. అంతకుముందు తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ పట్టణ సీఐ రాజేందర్ రెడ్డితో కలిసి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కొత్త వారికి విధులు: డీఈఓ రేణుకాదేవి
పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాల పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన డీఈఓ రేణుకాదేవి మాట్లాడుతూ పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ కేంద్రంలో సస్పెండ్ కు గురైన డీఓ, సీఎస్, ఇన్విజిలేటర్ల స్థానాలలో కొత్త వారిని నియమించడం జరిగిందని తెలిపారు.

ఇందులో ఇదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడిని నియమించడం జరిగిందని, మిగతా వారిని ఇతర పాఠశాల నుంచి నియమించడం జరిగిందని వివరించారు. మొదటి రోజు వాట్సాప్‌లో ప్రత్యక్షమైన ప్రశ్నా పత్రం వ్యవహారంపై పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని తెలిపారు.

కూపీ లాగుతున్నాం : డీఎస్పీ శేఖర్ గౌడ్
మరోవైపు వాట్సాప్ లో ప్రత్యక్షమైన పదో తరగతి ప్రశ్నా పత్రంపై విచారణ ముమ్మరం చేయడం జరిగిందని డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. బందెప్ప ఫోన్ నుంచి ప్రశ్నాపత్రం మరో ఉపాధ్యాయుడు సమ్మప్పతో పాటు ఇంకా ఎవరెవరికి వెళ్లింది అనే దానిపై కూపీ లాగుతున్నామని తెలిపారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందనే దానిపై కూడ విచారణ జరుపుతున్నామని, దాని ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.