పోడు రైతులకు శుభవార్త..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

పోడు రైతులకు శుభవార్త..!
– ఈనెలాఖరులోగా పట్టాల పంపిణీ
– జిల్లాలో అర్హులు ఎంతమంది ఉన్నారంటే..?
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని పోడు రైతులకు మంచి శుభవార్త. అర్హులైన రైతులకు ఈనెలాఖరులోగా పోడు పట్టాలను పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాలోని రైతులు ఏన్నో ఏండ్లుగా భూములు సాగుచేసుకుంటున్నా పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ సర్కారు అర్హులైన పోడు రైతులకు పట్టాలను అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. వచ్చిన దరఖాస్తులలో అర్హును గుర్తించేందుకు అధికారు క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి అర్హులను గుర్తించారు. జిల్లాలోని 114 గ్రామ పంచాయతీల్లో గిరిజన, గిరిజనేతర విభాగాలలో భూములను సాగుచేసుకున్న రైతులు 438 మంది ఉన్నట్లుగా గుర్తించారు.

మండలాల వారిగా అత్యధికంగా కుల్కచర్ల మండలంలో 188 మంది, అత్యల్పంగా కోడంగల్‌లో 6, పూడూరులో 6 మంది ఉండగా పరిగిలో 77 మంది, ధారూరులో 54 మంది, చౌడాపూర్‌లో 33 మంది, యాలాలలో 30 మంది, దోమలో 28 మంది, పెద్దేముల్‌లో 11 మంది, బషీరాబాద్‌లో 7 మంది రైతులను అర్హులుగా తేల్చారు. సర్వే అనంతరం సబంధించిన వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో పొందు పర్చారు. ఇప్పటికే ఈ సర్వే నివేధికను ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వ ఆదేశాలు రాగానే దాదాపు ఈనెలాఖరులోగా పోడు రైతులకు పట్టాలు అందించాలని జిల్లా కలెక్టర్, అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. పారదర్శకంగా అర్హులకు పట్టాల పంపిణీ జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.