సరిహద్దులో అక్రమాల కట్టడి..!
– కొత్లాపూర్ వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు
– జిల్లా ఎస్పీ ఆదేశాలతో నిఘా చర్యలు
– కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు కట్టడి చర్యలు చేపట్టారు. తాండూరు మండలం తెలంగాణ సరిహద్దు గ్రామం కొత్లాపూర్ సమీపంలో చెక్ పోస్టు ఏర్పాటు చేయడం జరిగిందని కరణ్ రాకోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు గురువారం ఈ చెక్ పోస్టు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు ప్రారంభమైన నేపథ్యంలో అక్కడి ధాన్యం అక్రమ రవాణా జరగకుండా కట్టడి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీంతో పాటు కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో మద్యం రవాణా జరగకుండా దృష్టి సారించడం జరుగుతుందన్నారు.
అంతేకాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీసు, ఎక్సైజ్ అధికారుల సమన్వయంతో సరిహద్దుల్లో అక్రమాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఎవరైనా అక్రమాలు, అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు, ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

