ఇదేం పేచీ సార్లు..!
– కమీషనర్ వర్సెస్ శానీటరి ఇనుస్పెక్టర్
– తాండూరు మున్సిపల్లో పంచాయతీ
– సీజ్ చేసిన ఐస్ షాపు విషయంలో రగడ
తాండూరు, దర్శిని ప్రతినిధి: అధికారుల మద్య సమన్వయం లేకపోతే పేచీ తలెత్తుతుంది. మంచి విషయానికి అయితే ఎలాంటి సమస్య ఉండదు. కాని విభేధాలు తలెత్తేది అయితే అనుమానాలకు తావిస్తోంది. అలాంటి పరిస్థితి వికారాబాద్ జిల్లాలోని తాండూరు మున్సిపల్లో జరిగింది. మున్సిపల్ కమీషనర్ వర్సెస్ శానీటరీ ఇనుస్పెక్టర్ అనేలా వ్యవహారం నడుస్తోంది. అసలేం జరిగిందంటే.. ఇటీవల వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని ఐస్ క్రీం షాపులపై టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించింది. ఇందులో కల్తీ ఐస్ క్రీం వ్యాపారానికి పాల్పడిన యజానులపై కేసు నమోదు చేశారు. దీనిపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సోమవారం తాండూరులోని పలు ఐస్ క్రీం షాపులపై దాడులు నిర్వహించారు. మున్సిపల్ కమీషనర్ శంకర్ సింగ్‌కు సమాచారం అందించి శానిటరీ ఇనుస్పెక్టర్ ఉమేష్ కుమార్ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు.
ఈక్రమంలో మున్సిపల్ సమీపంలో ఉన్న నందనీ ఐస్ క్రీం షాపులో అనుమతులు లేకుండా కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఎక్స్పైరీ లేని కల్తీ ఐస్ క్రీంలు తయారు చేస్తున్నట్లు కూడా గుర్తించారు. కొన్ని రసాయనాలను కూడా సీజ్ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఆ తరువాతే కమీషనర్, శానిటరీ ఇనుస్పెక్టర్ మద్య విభేధాలు వచ్చాయి. సీజ్ చేసిన షాపు యజమాని మున్సిపల్ కమీషనర్‌ను కలిసి కొన్ని పత్రాలను చూపించారు. వెంటనే కమీషనర్ శంకర్ సింగ్ శానిటరీ ఇనుస్పెక్టర్ ఉమేష్ కుమార్‌కు షాపు తాళాలు ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకు శానిటరీ ఉమేష్ కుమార్ షాపుకు జరిమాన విధించి.. వసూలు చేసిన తరువాత ఇవ్వాలని అభిప్రాయం తెలిపారు.

దీంతో ఇద్దరి మధ్య పేచీ పెరిగింది. ఈ వ్యవహారం మొత్తం పత్రికల మీదకు ఎక్కింది. అధికారుల విషయం తెలిసిన పట్టణ వాసులు సార్లు ఇదేం పేచీ అంటూ విమర్శిస్తున్నారు. ఈ మొత్తం కథనంలో ట్విస్ట్ ఏమిటంటే.. సోమవారం ఉదయం షాపులను సీజ్ చేస్తే అధికారులు ఆరోజు రాత్రి వరకు వేచి మీడియాకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంలో ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. కమీషనర్, శానిటరీ ఇనుస్పెక్టర్ మద్య విభేధాలు రావడంతో విషయం బయటకు వచ్చిందనే విషయాన్ని అందరు గమనిస్తున్నారు.

