బైపాస్ పరిహారం పెంచండి..!
– సమావేశంలో రైతులు, భూ బాధితులు
– జిల్లా కలెక్టర్‌కు నివేధిస్తాం: ఆర్డీఓ శ్రీనివాస్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో నిర్మిస్తున్న బై పాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి పరిహారం పెంచాలని బాధిత రైతులు కోరారు. తాండూరు మండలం అంతారం, చెంగోల్ గ్రామాల్లో బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో గురువారం ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సమావేశం కొనసాగింది. 2017లో తాండూరులో బైపాస్ రోడ్డు మంజూరయ్యింది. 97 ఎకరాలలో బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది.
తాండూరు మండలం అంతారం గ్రామంలో 1 ఎకరా 20 గుంటలు, చెంగోల్ గ్రామంలో 8 ఎకరాల 16 గుంటల భూమి సేకరణ పెండింగ్ లో ఉండిపోయింది. ఇందులో భాగంగా ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులు భూమి కోల్పోతున్న వారికి పరిహారం పెంచాలని కోరారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ అంతారంలో భూమి కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.6లక్షల 5వేల 500లను నిర్ణయించిందని, పరిహారం కింద మూడు రెట్లు కలిపి రూ.18లక్షల 19వేల 500లు అందించేందుకు సిద్దంగా ఉందన్నారు.
అదేవిధంగా చెంగోల్ లో ఎకరాకు రూ.6లక్షల 75వేల 500ల ప్రభుత్వం ధర నిర్ణయించగా దానికి మూడు రెట్లు అంటే రూ. 20లక్షల 25వేలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అదేవిధంగా గజాల ధ చొప్పున భూములు కోల్పతున్న వారికి కూడా ఒక గజానికి రూ.900లను మూడు రెట్లకు పెంచి అందించేందుకు పరిహారం ఖరారు చేసిందన్నారు. గజాల భూముల్లో కాస్తులో ఒకరు, కబ్జాలో మరొకరు ఉన్నారని. వాటిని కూడా సరిచేసి అర్హులైన రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. రైతులు కోరిన పరిహారం విషయాలను నివేధికలో పొందు పరిచి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తారాసింగ్. ఆర్డీఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఇదికూడా చదవండి…

