రేణుకా ఎల్లమ్మ జాతరకు వేళాయే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రేణుకా ఎల్లమ్మ జాతరకు వేళాయే..!
– ముస్తాబైన కొత్లాపూర్ దేవాలయం
– రేపటి నుంచి జాతర, ఈనెల 19న రథోత్సవం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం కొత్లాపూర్‌లో వెలసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాలకు వేళయ్యింది. రేపు శుక్రవారం నుంచి జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జాతర సందర్భంగా కొత్లాపూర్‌లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. శుక్రవారం నుంచి దేవాలయంలో అమ్మవారిని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటి చైర్మన్‌ పట్లోళ్ల సందీప్ రెడ్డి, ఈఓ శేఖర్ గౌడ్‌లు తెలిపారు. ఈనెల 5 నుంచి వచ్చే నెల 4వ తేది వరకు జాతర ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. జాతరకు వచ్చే భక్తుల కోసం ఆలయంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జాతర ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన రథోత్సవ ఉత్సవాలను ఈనెల 19న నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

భక్తుల కొంగు బంగారంగా..
తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని తాండూరు మండలం కొత్లాపూర్‌ గ్రామంలో వెలసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. వందల ఏండ్ల క్రితం గ్రామానికి చెందిన రాళ్ల రాగిరెడ్డి పొలంలో అమ్మవారి విగ్రహం బయటపడినట్లు స్థానికులు పురాణంగా చెబుతుంటారు. పొలంలో నుంచి ఉద్భవించిన అమ్మవారి విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించినా తిరిగి మళ్లీ చోట దర్శనం కావడంతో పండితుల సూచనతో రాగిరెడ్డి కుటుంబ సభ్యులు అదే చోట దేవాలయాన్ని నిర్మించారని కథలుగా చెబుతుంటారు. చరిత్ర కలిగిన అమ్మవారిని దర్శించుకునేందుకు తాండూరు పరిసర ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు.