గ్రంథాలయ సేవల విస్తరణే ధ్యేయం
– రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
– మర్పల్లిలో నూతన భవన ప్రారంభం
– హర్షం వ్యక్తం చేసిన చైర్మన్ రాజుగౌడ్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణలో గ్రంథాలయాల సేవలను విస్తరించడమే ధ్యేయంగా సర్కారు కృషి చేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామంలో నూతన గ్రంథాలయ శాఖ భవన ప్రారంభోత్సవం నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ ఆధ్యక్షతన ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఆనంద్, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరై గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ప్రతి మండలంలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించటం జరిగిందన్నారు. ఆధునిక హంగులతో ,అన్ని సౌకర్యాలతో నూతన రీడింగ్ హాల్ వంటి సేవలను విస్తరించేందుకు కృషి చేస్తోందన్నారు. గ్రంథాలయ సేవలను అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రంథాలయాలకు తెలంగాణ సర్కారులో పూర్వవైభవం వస్తోందన్నారు. నూతనంగా గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం రాజుగౌడ్ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్, కలెక్టర్ నారాయణ రెడ్డిలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సభ్యులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…
కంట్లో నుంచి బియ్యం, ప్లాస్టిక్ కవర్లు..!
– వ్యర్థాలు కూడా బయటకు
– ఆరేళ్ల పాపకు వింత వ్యాధి
– కలకలం రేపుతున్న ఘటన
https://dharshininews.com/17255


