యాది మరవని చేయూతకు సెల్యూట్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

యాది మరవని చేయూతకు సెల్యూట్..!
– కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
– డీఎస్పీ చేతుల మీదుగా రూ. 1.లక్షా 10వేల అందజేత
– కుటుంబానికి అభయమిచ్చిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరించే పోలీసులంటే.. కర్కశ గుణం గలవారు అన్న భావనే చాలా మందిలో గూడుకట్టుకొని ఉంటుంది. కానీ.. వారు కూడా మనసున్న మారాజులేనని, దాతృత్వాన్ని చాటడంలో వారూ ముందుంటారని మరోసారి తాండూరు పోలీసులు నిరూపించారు. తమ శాఖలో పనిచేసి గుండెపోటుతో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక చేయూతను అందించి అందరి మనస్సులో సెల్యూట్ అందుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం వాల్మీకి నగర్ కు చెందిన కానిస్టేబుల్ కావలి రవీందర్ గత 6 మాసాల క్రితం గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అతని కుటుంబానికి అండగా ఉంటామని ఇచ్చిన మాట మరువకుండా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మంగళవారం తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేష్‌లు ఎస్ఐలతో కలిసి కానిస్టేబుల్ కావలి రవీందర్ ఇంటికి వెళ్లి భార్య,పిల్లలను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ అధైర్య పడకండి, ఎల్లవేళలా అండగా ఉంటామని, భవిష్యత్తులో ఏ సమస్య ఎదురైనా కూడా అండగా పోలీస్ డిపార్ట్మెంట్ తోడుగా నిలుస్తుందని భరోసానిచ్చారు.

అనంతరం తాండూరు సబ్ డివిజన్ ఎస్ హెచ్ ఓ లు, పెద్దేముల్ పిఎస్ సిబ్బంది ఆధ్వర్యంలో కుటుంబానికి రూ. 1,10,000 నగదు ఆర్థిక సహాయాన్ని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేష్ చేతుల మీదుగా కానిస్టేబుల్ రవీందర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు సబ్ డివిజన్ ఎస్సైలు గిరి, విట్టల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, పెద్దేముల్ పోలీసు సిబ్బంది మాసయ్య, ముంతాజ్, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

13న కామదహనం, 14 హోలీ