జోష్‌ పెంచిన మహేంద్రుడు..!

తాండూరు తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

జోష్‌ పెంచిన మహేంద్రుడు..!
– తాండూరు అసెంబ్లీ పోరుపై క్లారీటి
– నిలిచేది నేనే గెలిచేది నేనే అంటూ ధీమా
– గుర్తు మారోచ్చిన నేతలకు గుణపాఠమే
– విమర్శలకు ధీటుగా బదులు ఇస్తాం
– దశాబ్ది ఉత్సవాలతో పల్లె పల్లెకు ఎమ్మెల్సీ వాయిదా
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని కొన్నాళ్లుగా స్థబ్దుగా ఉన్న రాజకీయాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ జోష్ పెంచారు. తాండూరు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేది నేనే.. గెలిచేది నేనే అంటూ తాండూరు రాజకీయాలను వేడెక్కించారు. తనపై విమర్శులు చేసిన వాళ్లకు ధీటుగా జవాబిస్తామని అంటూనే ఒక గుర్తుపై గెలిచి.. మరో పార్టీలో చేరిన వలస నేతలకు ప్రజలే గుణపాఠం చెప్తారని అన్నారు. సీఎం కేసీఆర్ వాఖ్యలు, సర్వేలు తనకే అనుకూలంగా ఉన్నాయని, తాండూరు అసెంబ్లి ఎన్నికల బరిలో ఎదురేలేదని పోటీపై క్లారిటీ ఇచ్చారు.

బుధవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్థానిక నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.

ధీటుగా బదులిస్తాం
ఇటీవల కొంత మంది తనపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని.. అలాంటి వారికి ధీటుగా బదులిచ్చే సమయం ఆసన్నమైందన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా తాండూరు నియోజకవర్గానికి ఏం చేయలేదని చేసిన తప్పుడు ఆరోపణలు అన్నింటి లెక్కలు తేలుస్తామన్నారు. మంత్రిగా ఉన్నప్పుడే దాదాపు రూ. 2వేల కోట్లతో అభివృద్ధి పనులను చె పట్టడం జరిగిందన్నారు. త్వరలో గ్రామ గ్రామానికి, పట్టణంలో పర్యటించి ఇన్నేళ్లలో తాను చేసిన ప్రతి అభివృద్ధి పనులను జీఓలతో, ప్రోసిడింగ్ లతో ప్రజలకు వివరించి.. విమర్శకుల కళ్లు తెరిపించేలా జవాబిస్తాన్నారు. దీంతో పాటు కొన్నేళ్లుగా తాండూరు ప్రజలను మభ్యపెట్టేలా నేతలు ప్రగల్బాలకు పోతున్నారని అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని అన్ని గ్రామాలకు ప్రభుత్వం రూ. 50 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసిందని గుర్తుచేశారు. కాని ఇక్కడ కొంత మంది తామే సాధించుకు వచ్చినట్లు గొప్పలు పోతున్నారని విమర్శించారు.

గుర్తు మారి వచ్చిన వారికి గుణపాఠమే
తెలంగాణ ఏర్పడిన తరువాతే ఎమ్మెల్యే పదవి కాలం చివరి దశలో ఉండగా టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరడం జరిగిందని మహేందర్ రెడ్డి గుర్తుచేశారు. కారు గుర్తుపైనే గెలిచి టీఆర్ఎస్ పార్టీలోనే మంత్రిగా కొనసాగడం జరిగిందన్నారు. ఎక్కడా కూడ ఒక గుర్తుపై గెలిచి.. మరో పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు. కొందరు ఒక గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరి పదవులు అనుభవిస్తున్నారని అన్నారు. అలాంటి వారికి ఎన్నికల సమయంలో ప్రజలే గుణపాఠం చెప్తారని అన్నారు. ఒక గుర్తుపై గెలిచిన నేత ఇప్పుడున్న పార్టీలో సొంత పార్టీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు బనాయించేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యాపారులు, కార్యకర్తలను ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని అన్నారు.

ఒరిజనల్ నేతలు వెంట ఉన్నారు
గత కొన్ని నెలలుగా తన రాజకీయ ప్రభావం తగ్గిందని వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్పందించారు. అలాంటిదేమి లేదని కొందరు స్వార్థ పరులే పదవుల కోసం మరో వర్గంలో చేరారని అన్నారు. పదవులపై ఆశ ఉన్న వారిని తానే స్వయంగా మరో వర్గంలోకి వెళ్లమని సూచించినట్లు తెలిపారు. నా వెంట ఉన్నది ఒరిజినల్ నేతలు అని.. వెళ్లిపోయిన వారు డూప్లికేట్ నేతలు (వెంటనే డూప్లికేట్ అనడం సరికాదు.. మళ్లీ వాళ్లు నావద్దకే వస్తారు.. నవ్వుతూ) అన్నారు.

దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చేస్తాం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా మండల స్థాయి, పట్టణ స్థాయి, గ్రామ స్థాయిలో 22 రోజుల పాటు జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటామన్నారు. జెడ్పీటీసీలు, ఎంపిటీ స్రీలు, సర్పంచులు, వైర్ పర్సన్, కౌన్సిలర్లు అందరితో కలిసి వేడుకలను జయప్రదం చేస్తామన్నారు.

పల్లె పల్లెకు ఎమ్మెల్సీ తాత్కాళిక వాయిదా
మరోవైపు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పల్లె పల్లెకు ఎమ్మెల్సీ కార్యక్రమాన్ని తాత్కాళికంగా వాయిదా వేసినట్లు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. దశాబ్ది ఉత్సవాలు ముగిసిన రెండో రోజు తరువాత నుంచి పల్లె పల్లెకు ఎమ్మెల్సీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, బషీరాబాద్ జెడ్పీటిసి శ్రీనివాస్ రెడ్డి, మాజీ డీపీపీ సభ్యులు పట్లొళ్ల నర్సింలు, సీనియర్ నాయకులు’ సిద్రాల శ్రీనివాస్, అజయ్ ప్రసాద్, కౌన్సిలర్ బోయరవి, రాము, నాయకులు బిర్కడ్ రఘు, బిదర్ రాజ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
chaithany collage