బీఆర్‌ఎస్‌తో బీసీలకు ఒరిగిందేమి లేదు

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్‌ఎస్‌తో బీసీలకు ఒరిగిందేమి లేదు
– బీజేపీ, బీఆర్ఎస్ వల్ల అణచివేతకు గురయ్యాం
– డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే పుల్ సపోర్టు
– బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర ఇంచార్జ్ రాచాల యుగంధర్ గౌడ్
– తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై విమర్శలు, ఆరోపణలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ వల్ల తెలంగాణాలో బీసీలకు ఒరిగిందేమి లేదని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగిన 1200ల ఆత్మ బలిదానాలలో 1100 బీసీలే ఉన్నారని అన్నారు. గద్దె నెక్కిన సీఎం కేసీఆర్ 10 ఏండ్లలో బీసీలకు చేసిందేమి లేదన్నారు. బర్లు, గొర్లు ఇచ్చామని మభ్యపెట్టిందన్నారు. ఉద్యోగాలు నోటిఫికేషన్లు వేసి లీకేజీతో నిరుద్యోగుల ఉసురును మూటగట్టుకుందన్నారు. అదేవిధంగా కార్పోరేషన్లకు బడ్జెట్ కేటాయించలేక పోవడంతో పాటు రిజర్వేషన్ల హామిని తుంగలో తొక్కారని అన్నారు. కేంద్రంలో బీజేపీ సైతం బీసీ కుల గణన చేయకుండా విస్మరించిందన్నారు.

కేంద్ర మంత్రిత్వ శాఖలో బీసీలకు మంత్రి పదవి ఇవ్వలేదని ద్వజమెత్తారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అని, ఆ రెండు పార్టీలు బీసీలను అణచివేతకు గురిచేశాయన్నారు. బీసీ పొలిటికల్ పార్టీ తరుపున కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని, పక్కాగా అమలు చేస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. బీసీలను విస్మరించిన బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. మరోవైపు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై విమర్శలు చేశారు. యువత రాజకీయాల్లోకి రావాలనే నినాదంతో ఎన్నికల్లో గెలిచిన ఆయన నియోజకవర్గంలో ఏ ఒక్క యువతకు సర్పంచులు, ఎంపీటీసీల పదవులు ఇప్పించారో చెప్పాలన్నారు. డ్రగ్స్, అక్రమ దందాలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ముందు వరుసలో ఉన్నారని ఆరోపించారు. తాండూరులో కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి గెలుపుకు మద్దతిస్తామని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సస్ రత్నమాల నర్సింలు, కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్ నీరజా బాల్ రెడ్డి, నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, బంటు మల్లప్ప, హన్మంతు ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ సోఫియా, మహిళ నాయకురాలు సౌజన్య, మాధవి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కావలి సంతోష్, పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ రెడ్డి, యువనాయకులు తాండ్ర రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..

 మోసపోవద్దు గొసపడతాం..