చివరి 48 గంటలపై నజర్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

చివరి 48 గంటలపై నజర్..!
– ఆ తప్పుచేస్తే అనర్హత వేటే..?
– అసెంబ్లీ ఓటింగ్ కు అంతా రెడీ
– వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం ముగిసిన తరువాత చివరి 48 గంటలపై ప్రత్యేక దృష్టి ఉంచుతున్నామని.. నిబంధనలు భేఖాతరు చేస్తే తప్పక చర్యలు ఉంటాయని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు ఆర్వో కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో సుమారు 9 లక్షల 60వేలకు పైగా ఓటర్లు ఉన్నారని, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తాండూరు, కోడంగల్, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల్లో మొత్తం 1133 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు పోలింగ్ సిబ్బంది, ఓటర్ల జాబితా, ఓటింగ్ మెటిరియల్ అంతా సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే ఓటర్లకు పోలింగ్ చిట్టీలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఓటర్లకు పోలింగ్ చిట్టీలపై పోలింగ్ కేంద్రం సంఖ్య, చిరునామా, బీఎల్ ఓల ఫోన్ నెంబర్లు ఉంచడం జరిగిందన్నారు. పోలింగ్ చిట్టీల వెంట ఓటరు ఓటు ఎలా వేయాలనే దానిపై ఓటింగ్ గైడ్ కూడా అందించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా పోలింగ్ చిట్టీలతో పాటు సీవిజిల్ యాప్ గురించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే ఎలా ఫిర్యాదు చేయాలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈనెల 30న పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్ లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఇంటి నుంచి ఓటు వేసే వృద్ధులు, వికలాంగులకు సంబంధించి జిల్లాలో 151 దరఖాస్తులు అందాయని, పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది నుంచి దాదాపు 7వేల వరకు దరఖాస్తులు అందాయన్నారు. ఈనెల 23, 24వ తేదిలలో ఇంటి వద్ద నుంచి ఓట్లు వేసే వృద్ధులు, వికలాంగుల నుంచి ఓటింగ్ స్వీకరిస్తామన్నారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది కోసం పోస్టల్ బ్యాలెట్ పత్రాలు వచ్చాయన్నారు. రేపటి నుంచి ఆర్వో కార్యాలయాల వద్ద పోస్టల్ ఓటింగ్ ప్రారంభమవుతుందన్నారు. రేపటి నుంచి పోలింగ్ సిబ్బందికి ఈవీఎంపై రెండో విడత శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఇప్పటి వరకు బరిలో ఉన్న అభ్యర్థులు అందరు సహకరిస్తున్నారని తెలిపారు. వారి ఎన్నికల వ్యయానికి సంబంధించి బృందాలు పరిశీలన చేస్తున్నాయన్నారు. ఎవరైనా ఎన్నికల ఖర్చులను చూపించకుండా ఖర్చు చేస్తే ఎన్నికల తరువాత వారిపై అనర్హత వేటు తప్పదన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత మిగిలిన 48 గంటలు విరుద్ధంగా జరిపే ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేసినా లేదా డబ్బులు, మద్యం పంపిణీ చేసిన చర్యలు తప్పవన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుపుకునేందుకు అందరు సహకరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎన్నికల వ్యయ అధికారులు, ఎన్నికల అధికారులు ఉన్నారు. అంతకుముందు ఎన్నికల వ్యయ పరిశీకులు రత్నాకర్ కాలో, తాండూరు ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావులు అభ్యర్ధుల ఖర్చులపై సమీక్ష జరిపారు. నిబంధనల ప్రకారం ఖర్చుల వివరాలను నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శేఖర్ గౌడ్, తహసీల్దార్ తారాసింగ్, అభ్యర్థులు, ఏజెంట్లు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!