బైపాస్‌కు స్మాల్ బ్రేక్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బైపాస్‌కు స్మాల్ బ్రేక్..!
– పరిహారం, సమాచారం ఇవ్వకుండా పనులు
– కోర్టుకు వెళ్లిన మహిళా రైతు
– భూమిలో కంకర తొలగించిన అధికారులు
– చర్చనీయాంశమైన సంఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బైపాస్‌ రోడ్డు నిర్మాణంలో స్మాల్ బ్రేక్ పడింది. రోడ్డు నిర్మిస్తున్న భూమిలో తమకు సమాచారం అందించకుండా, పరిహారం కూడా చెల్లించకుండా పనులు చేయిస్తున్నారని బాధిత మహిళ రైతు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆర్అండ్‌బీ అధికారులు దగ్గరుండీ భూమిలో వేసిన కంకరను తొలగింపు చేయించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ శివారులోని సర్వేనెంబర్ 248, 250 సర్వేనెంబర్లలో తాండూరుకు చెందిన కాంగ్రెస్‌ నేత నయీంఅక్తర్ భార్య అబిసుల్తానా అనే మహిళా రైతుకు 24 గుంటల భూమి ఉంది.

2017లో ఇట్టి భూమిలో పాలిసింగ్‌ యూనిట్లు ఉండేవి. ఈ భూమి మీదుగా బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో వాటిని ఖాళీ చేయాల్సి వచ్చింది. అయితే అధికారులు తమకు పరిహారం చెల్లించకుండా, సమాచారం అందించకుండా భూమిలో పనులు చేపట్టారని అడ్డుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిహారం చెల్లించి పనులు చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారులకు విన్నవించారు. అయినా స్పందన లేకపోవడంతో అధికారులపై హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో శుక్రవారం ఆర్ అండ్ బి శాఖ డీఈ శ్రీనివాస్ తో పాటు సిబ్బంది హుటాహుటిన బాధిత రైతు భూమి వద్దకు చేరుకున్నారు. అక్కడ వేసిన కంకరను యంత్రాలు.. వాహనాలను పెట్టి తొలగించారు. పరిహారం చెల్లించిన తరువాతనే పనులు చేపడుతామని బాధిత రైతు భర్త నయీంఅక్తర్‌కు తెలిపారు. కోర్టులో వేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఈ సంఘటన తాండూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇదికూడ చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం