చేవేళ్లలో బీజేపీకి 3లక్షల మెజార్టీ
– పార్లమెంట్‌లో ఫస్ట్ గెలుపు కొండాదే
– రంజిత్ రెడ్డికి హస్తంలోనే ఆదరణలేదు
– కొండాను ఢీకొట్టలేక దుష్ర్పచారం
– మీడియా సమావేశంలో బీజేపీ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డితోనే బీజేపీ గెలుపు ఖాతా తెరవడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం తాండూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడీయా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కొండా వైపు మద్దతుగా నిలుస్తుండగా మరోవైపు దేశంలో ప్రధాని మోడిని గెలిపించుకునేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు.
చేవేళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డితోనే బీజేపీ గెలుపు ఖాతా తెరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చేవేళ్లలో బీజేపీకీ 3లక్షల మెజార్టీ ఖాయమన్నారు. మరోవైపు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఢీకొనే సత్తా లేక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మార్చడం జరిగిందని, చివరకు అవినీతి పరుడుగా ముద్రపడిన రంజిత్ రెడ్డిని బరిలో నిలిపారని విమర్శించారు. కోడి గుడ్లు, మక్క దానంతో పాటు దేవాలయ భూములను ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే రంజిత్ రెడ్డికి సరైన ఆదరణ లేదన్నారు. గ్రామాల్లో పర్యటనకు వెళుతున్న రంజిత్ రెడ్డికి వ్యతిరేకత ఎదురవుతుందని విమర్శించారు.

మచ్చలేని నాయకుడుగా గుర్తింపు ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలిశివకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్ సాహు శ్రీలత, జిల్లా మాజీ కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఇదికూడా చదవండి…


