చేపల వలకోసం నీటిలో దిగి వ్యక్తి మృతి
– తాండూరు మండలం రాంపూర్‌లో ఘటన
– కేసు నమోదు చేసిన కరణ్ కోట్ పోలీసులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : చేపల కోసం వేసిన వలను తీసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి నీట మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన తాండూరు మండలం కరణ్ కోట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రాంపూర్‌కు చెందిన రాజు నాయక్ అనే వ్యక్తి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే మంగళవారం సాయంత్రం గ్రామ శివారులో ఉన్న ఓ నీటి గుంతలో చేపల కోసం వల వేసి ఉంచాడు.
బుధవారం ఉదయం 7గంటల ప్రాంతంలో చేపల కోసం వేసిన వలను తీసుకవస్తానని భార్య సావిత్రిబాయికి చెప్పి ఇంటి నుంచి బయల్దేరి వెళ్లాడు. నీటి గుంత వద్ద చేపల వలను తీస్తుండగా రాజునాయక్ ప్రమాద వశాత్తు నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. గమనించిన రాజు నాయక్ సోదరుడు రమేష్ విషయాన్ని ఇంట్లోవాళ్లకు తెలిపాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురికి తరలించారు. మృతుని భార్య సావిత్రిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు.
ఇదికూడా చదవండి…

