పది నెలల్లో కొత్త రైల్వే స్టేషన్..!
– స్పీడ్‌గా తాండూరు రైల్వే ఆధునీకరణ
– స్టేషన్లో ఎస్కలేటర్, పార్కింగ్, విశ్రాంతి గదుల నిర్మాణం
– పనులను పరిశీలించిన డీఆర్ఎం భర్తేష్ కుమార్ జైన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పది నెలల్లో తాండూరు రైల్వే స్టేషన్ రూపు రేఖలు మారబోతున్నాయని, కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తుందని దక్షిణ మద్య రైల్వే శాఖ డివిజన్ రైల్వే మేనేజర్(డీఆర్ఎం) భర్తేష్ కుమార్ జైన్ అన్నారు. శుక్రవారం తాండూరు రైల్వే స్టేషన్లో దాదాపు రూ.25 కోట్లతో చేపడుతున్న అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించారు. స్టేషన్ ముందు భాగంలో, ప్లాట్ ఫారాలపై చేపడుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. పార్కింగ్, ఎస్కలేటర్, మరుగుదొడ్ల, విశ్రాంతి గదుల నిర్మాణ పనులను ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ భారత్ కింద తాండూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణకు దాదాపు రూ.25 కోట్లు మంజూరైన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నిధులతో రైల్వే స్టేషన్ రూపు రేఖలు మార్చబోతున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల కోసం ఎస్కలేటర్, పార్కింగ్, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు వంటి సౌకర్యాలను కల్పించబొ తున్నట్లు వివరించారు. ఈ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. వచ్చే 10 నెలల్లో కొత్త రైల్వే స్టేషన్ ను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం రైల్వే ఆధునీకరణ వల్ల జరుగుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రయాణికులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఇదికూడా చదవండి…

