జామ పౌడర్‌ ఫుల్‌ డిమాండ్..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

chai jr
జామ పౌడర్‌ ఫుల్‌ డిమాండ్..!
– దీని టీలు, కషాయాలు ట్రెండ్‌
– ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..?
దర్శిని డెస్క్ : జామలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని అందరికి తెలిసిందే. కల్తీ లేని జామ ఆకులు, పండ్లతో మనకు ఎన్నో ఉపయోగాలు కలుగుతాయని వైద్య నిపుణులు, డైట్, న్యూట్రీషన్ నిపుణులు చెబుతున్నారు. ఒంట్లో వేడి కారణంగా ఆరోగ్యం దెబ్బతిన్నా.. నోటి రుగ్మతలు ఏర్పడినప్పుడు జామాకు నమిలితే వెంటనే ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు జామాకు మంచి ఔషధం. వేడి నీటిలో జామ ఆకుల్ని మరిగించి ఉదయం కషాయంలా తాగితే దీర్ఘకాలిక రోగాలకు చెక్ పెట్టే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. ఇటీవల కాలంలో కొందరు గృహిణులు జామాకు రెసిపీలను ఉదయాన్నే తీసుకోవడం చూస్తున్నాం.

చాలామంది జనాలు ప్రతీరోజు తాము తీసుకునే డైట్‌లో ఆర్గానిక్‌ ఉండేలా చూసుకుంటున్నారు. అలాంటి ఆర్గానిక్‌ ఆరోగ్యానికి సరికొత్త ఔషధం ఏంటంటే.. జామ పౌడర్. అంటే జామకాయ పౌడర్‌ కాదు. జామాకుతో తయారుచేసిన పొడి. ఈ జామ పౌడర్‌ కలిపిన టీలు, కషాయాలు ట్రెండ్‌గా మారాయి. ఈ జామ ఆకులను మౌత్‌ ఫ్రెష్‌నర్‌గా వాడేవారు మన పూర్వికులు. దానిలో చింతపండు పెట్టుకుని తిన్న జనరేషన్‌ కూడా ఉంది. ఈ పొడి వల్ల అనేక ఆరోగ్యపరమైన బెనిఫిట్స్‌ ఉండడంతో జామాకులకు డిమాండ్‌ అమాంతంగా పెరిగిపోయింది.

ఔషధ గుణాల లక్షణాలు అధికంగా ఉండడంతో ప్రస్తుతం జామాకులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. జామ ఆకులను తుక్కుగా భావించి తగలబెట్టేవారు. ఇప్పుడు అది తుక్కుకాదు వారి పాలిట వరమైంది. ఈ జామాకు కోసం వ్యాపారులు ఎగబడుతుండడంతో నర్సరీ నిర్వాహకులకు కాసుల పంట పండుతోంది. ఈ జామ ఆకును.. వ్యాపారులు కిలోకి 20 నుంచి 50 రూపాయల వరకు ఇచ్చి కొని మార్కెట్‌ చేస్తున్నారు.

అలా కొన్న జామాకులను వ్యాపారులు గోడౌన్లు, ఖాళీ ప్రదేశాల్లో ఎండబెట్టి, దానిని పొడిగా చేసి బెంగళూరు, చెన్నైతోపాటు.. ఇతర నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలాంటి జామ ఆకుల పొడిని.. డికాషనల్‌లా ఉపయోగించి తేనెతోపాటు తీసుకుంటే ఎంతో ఉపయోగకరం అని పలు పరిశోధనా సంస్థలు చెబుతున్నాయి. టన్ను జామ ఆకు ధర 37 వేల రూపాయలు ఉందంటే దానికి ఉన్న డిమాండ్ ఏంటనేది మనం అర్ధం చేసుకోవచ్చు.

ఇదికూడ చదవండి…

ట్రైన్‌లో కొత్త రూల్స్‌..!