చిలుక వాగు చిక్కులు తొలగేనా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

చిలుక వాగు చిక్కులు తొలగేనా..!
– నాలా హద్దులు లేక ఆగిన పూడిక తవ్వకాలు
– మొన్న ట్రాన్స్‌ఫార్మర్, నేడు నిర్మాణాల అంటకాలు
– సర్వేలో పూర్తిగా మారిన ప్రవాహక దారి
– అందరి దృష్టి నాలా ప్రక్షాళన పైనే
తాండూరు, దర్శిని ప్రతినిధి : వరధల ముప్పు నుంచి కాపాడే తాండూరు చిలుక వాగు ప్రక్షాళనకు రోజుకో చిక్కులు వచ్చి పడుతున్నాయి. దీంతో పనులు పూర్తవుతాయా లేదా అనేది సామాన్యులతో పాటు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షంతో తాండూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సాయిపూర్, ఆదర్శనగర్‌, తులసీనగర్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. మరుసటి రోజే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వరద ముప్పుపై సమీక్ష నిర్వహించారు.

చిలుకవాగు నాలా పూడికలో వరధ ముంపులు జరిగాయని గుర్తించారు. వెంటనే చిలుకవాగు నాలా ప్రక్షాళన చేయాలని రెవెన్యూ, ఆర్అండ్‌బీ, మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఆయా శాఖల అధికారులు హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో పూడిక తీత, కాలువ పునరుద్దరణ పనులు చేపట్టారు. మొదటి రోజు బీజేపీ నేతలు తవ్వకాల వద్దకు చేరుకుని పాత ప్రవాహా పద్దతిలో తవ్వకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆరోజు కొద్ది దూరం తవ్వకాలు జరిపారు. మరుసటి రోజు చేపట్టే తవ్వకాలకు నిర్మాణాలు, ట్రాన్స్‌ ఫార్మర్ అడ్డువచ్చిందని పనులు ఆపేశారు.

సర్వేలో నాలా మలుపులు
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పకడ్బందీగా నాలా ప్రక్షాళన చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. దీంతో ఆయా శాఖల అధికారులు చిలుక వాగు, నాలా సర్వేకు ఉపక్రమించారు. ఈ సర్వేలో అధికారులు విస్తృత పోయే విషయాలను గుర్తించారు. ఈ సర్వేలో చిలుక వాగు హైదరాబాద్ రోడ్డు మార్గం మొదలు కొని కోకట్ శివారులో ముగిసి కాగ్నా నదిలో కలుస్తుందని నిర్ధారించారు. గ్రామ నక్ష ఆధారంగా సర్వేనెంబర్ 36, 39, 41, 47, 48, 49, 52, 53, 57, 58, 59, 62, 63లలో ప్రవాహ మార్గం ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ సర్వే నెంబర్లలో చిలుక వాగు నాలా ప్రవాహాం పూర్తిగా మారిపోయిందని గుర్తించారు. నాలా ప్రవాహా మార్గంలో పాట్లు, నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. ఎన్నో మలుపులు తిరుగుతూ కోకట్ శివారు, సాయిపూర్ మీదుగా కాగ్నాలో కలుస్తున్నట్లు గుర్తించారు.

బాధితుల ఆందోళనలు
ప్రస్తుతం అధికారులు చిలుక వాగు సర్వే చేపట్టడంతో పలువురు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిలుక వాగు ప్రవాహ మార్గంలో తమకు చెందిన పాట్లు, నిర్మాణాలు ఉన్నాయని ముందుకొస్తున్నారు. దీంట్లో చిలుక వాగు మార్గం లేదని చెప్పి తమకు అమ్మకాలు చేపట్టారని తెలిపారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. తమకు అన్యాయం జరిగితే ఆందోళనలు చేస్తామని, అవసరమైతే కోర్టుకు వెళతామని చెబుతున్నారు. దీంతో చిలుక వాగు నాలా ప్రక్షాళనకు చిక్కులు ఏర్పడ్డాయి. ఇప్పుడు చిలుక వాగు నాలా పనులు కొనసాగుతాయా లేదా ఆగిపోతాయా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇదికూడా చదవండి…

ఘరానా కేటుగాళ్లు..!