పిల్లికి ఓ పండగ రోజు..!
– దేవతగా పూజించే ఆచారం
– పిల్లులను వేధిస్తే దోషులే
– వేయ్యేళ్లుగా సంప్రదాయం
దర్శిని ప్రతినిధి : పెంపుడు జంతువుగా, చెడు శకునంగా చూసే పిల్లిని పూజించే ఆచారం ఉందా అంటే ఒక్కక్షణం ఆశ్చర్య పోవాల్సివస్తుంది. నిజంగా అలాంటి సంప్రదాయం మనదేశంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలో పిల్లి దేవతను పూజించే వింత ఆచారాన్ని వేయ్యేళ్లుగా పాటిస్తున్నారు. వివరాల్లోకి వెళితే… కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని బెక్కలెలె గ్రామంలో ఈ ప్రత్యేకమైన పిల్లి దేవాలయం ఉంది. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు రోడ్డుకు అడ్డంగా పిల్లి వస్తే అరిష్టం అని నమ్మేవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ, ఇక్కడ మాత్రం పిల్లులు శుభప్రదమని నమ్మడమే కాకుండా పూజిస్తారు.
కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో ఈ పిల్లి దేవాలయం ఉంది. సుమారు 1000 సంవత్సరాల క్రితం పిల్లులను పూజించే సంప్రదాయం ప్రారంభమైంది. తమ దేవత మంగమ్మ పిల్లి రూపంలో గ్రామంలోకి ప్రవేశించిందని, దుష్ట శక్తుల నుండి తమ గ్రామాన్ని కాపాడుతుందని ఇక్కడి నివాసితులు నమ్ముతారు. ప్రతి సంవత్సరం ఇక్కడ పిల్లి రూపంలో మంగమ్మ పండుగను జరుపుకుంటారు. ఇక్కడి స్థానిక జ్యోతిష్కులు పండుగను నిర్వహించడానికి అత్యంత పవిత్రమైన రోజును నిర్ణయిస్తారు..మంగమ్మ పండుగను అత్యంత వైభవంగా, కోలాహలంగా నిర్వహిస్తారు.
మూడు నాలుగు రోజుల పాటు జరిగే ఈ పండుగను పట్టణ ప్రజలంతా కలిసి జరుపుకుంటారు. పిల్లిని పూజించే ఈ గ్రామంలో పిల్లికి ఎవరూ హాని చేయరు. అంతే కాకుండా ఈ గ్రామంలో ఎక్కడైనా పిల్లుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు గమనిస్తే స్థానికులు వారిని పట్టుకుని దోషులుగా శిక్షిస్తారు. ఈ గ్రామ పరిసరాల్లో ఎవరైనా పిల్లి చచ్చిపోయి కనిపిస్తే గౌరవంగా పాతిపెట్టే బాధ్యత తీసుకుంటారు.
ఇదికూడా చదవండి…

