పాత మున్సిపల్లో ఈఎస్ఐ ఆసుపత్రి..!
– భవనాన్ని కేటాయించేందుకు నిర్ణయం
– ఎమ్మెల్యే ఆదేశాలతో రంగం సిద్దం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఈఎస్ఐ ఆసుపత్రి కల త్వరలో నెరవేరుతోందనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నట్లు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పలు సమావేశాల్లో ప్రస్తావించారు. దాదాపు గత రెండేళ్లుగా తాండూరు మున్సిపల్ పాత కార్యాలయంలో ఖాళీగా ఉంది. కొత్త కార్యాలయానికి తరలివెళ్లిన తరువాత ఇందులో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని, షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ పోలీస్టేషన్ ఏర్పాటు చేయాలని భావించారు. కాని అవేవీ ఫలించలేదు.
కొన్ని రోజుల కింద ఓ ప్రైవేటు గ్రంథాలయానికి అప్పగించాలని కూడా నిర్ణయించారు. దీనిపై అభ్యంతరాలు రావడంతో ఆ నిర్ణయాన్ని కూడా మానుకున్నారు. తాజాగా ఈ కార్యాలయంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్వయంగా పలు సమావేశంలో ప్రకటించారు. దీంతో కార్యాలయంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. తాండూరు నియోజకవర్గంలో కర్మాగారాలు, పంచాయతీ, మున్సిపల్ శాఖల్లో కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఈఎస్ఐ ఆసుపత్రి అందుబాటులోకి తీసుకరావాలని చాలా ఏండ్ల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజా పరిస్థితులతో ఈఎస్ఐ ఆసుపత్రి అందుబాటులోకి వస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
ఇదికూడా చదవండి…

