శభాష్.. నర్సమ్మ..!
– పరీక్ష బందోబస్తులో పసికందుకు ఆలనా
– ఎగ్జాంకు వచ్చిన తల్లికి సాయం
– మహిళా కానిస్టేబుల్ సేవకు ప్రశంసలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రూప్ -3 పరీక్ష రాసేందుకు వచ్చిన బాలింతకు పరీక్షా కేంద్రంలో విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ సాయం అందించి శభాష్ అంటూ ప్రశంసలు అందుకుంది. తల్లి పరీక్ష రాసేందుకు వెళ్లగా ఆరు నెలల బాబును అక్కున చేర్చుకొని అలనా, పాలన చూసుకుంది. పరీక్ష సమయం ముగిసే వరకు బాబును ఎత్తుకొని ఆడించింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని శేర్లింగంపల్లికి చెందిన కృష్ణవేణి గ్రూప్ – 3 పరీక్షా రాస్తోంది. ఆమెకు 6 నెలల బాబు ఉన్నాడు.
గ్రూప్ -3 పరీక్ష కోసం తాండూరు పట్టణం సింధూ జూనియర్ కాలేజిలో ఏర్పాటు చేసిన కేంద్రానికి బాబుతో కలిసి వచ్చింది. కేంద్రంలోకి బాబు అనుమతి లేకపోవడంతో కేంద్రం వద్ద వీధుల్లో ఉన్న బషీరాబాద్ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ నర్సమ్మ బాబును తీసుకుంది. తల్లి పరీక్ష రాసి వచ్చేంతవరకు బాబును జాగ్రత్తగా చూసుకుంది. బాబు ఎడవకుండా జో కొడుతూనే.. మరోవైపు బందోబస్తు విధులు నిర్వర్తించింది. పరీక్షా కేంద్రంను తనిఖీ చేసేందుకు వచ్చిన సబ్ కలెక్టర్ ఈ దృశ్యాన్ని చూసి అభినందించారు. తోటి ఉద్యోగులు, ఇతర శాఖల ఉద్యోగులు, సిబ్బంది నర్సమ్మను శభాష్.. అంటూ.. అభినందించారు.
ఇదికూడా చదవండి…

