లగచర్లలో భూసేకరణ నిలిపివేత..!
– రేవంత్ సర్కారు కీలక నిర్ణయం
– ప్రభుత్వం నుంచి ప్రకటన
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన లగచర్ల భూ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా లగచర్లలో భూసేకరణను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో రేవంత్ సర్కారు ఫార్మా విలేజ్ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్ల ఫార్మాపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, అధికారులపై రైతుల దాడి ఘటనతో అరెస్టులు, పోలీసుల మోహరింపులతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే.
అక్రమ అరెస్టులపై ఆరోపణలు, విమర్శలు తలెత్తడంతో వారిని జాతీయ మానవ హక్కుల కమిషన్ దగ్గర వరకూ తీసుకెళ్లింది. ఎన్హెచ్ఆర్సీ దీనిపై విచారణ కూడా చేపట్టింది. ఇలాంటి సమయంలో అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం కొనసాగింది. ఈ పరిణామాల నేపథ్యంలో లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ను ప్రభుత్వం రద్దు చేసుకుంది. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో తమ పోరాటాలతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ప్రతిపక్షాలు చెప్పుకొచ్చాయి.
ఇదికూడా చదవండి…

