రోడ్డెక్కిన విద్యార్థులు…!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

రోడ్డెక్కిన విద్యార్థులు…!
– బస్సు కోసం మంబాపూర్ రోడ్డుపై ధర్నా
– జనగామ నుంచి బస్సు నడిపించాలని డిమాండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో విద్యార్థులు రోడ్డెక్కారు. మా గ్రామానికి బస్సు నడపాలని రోడ్డుపై బైటాయించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పెద్దముల్ మండలం జనగామ గ్రామానికి వారం రోజుల నుంచి బస్సు రావడం లేదు. గ్రామం నుంచి మంబాపూర్, తాండూరులో పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో బుధవారం మంబాపూర్ రోడ్డుపై స్కూల్, కాలేజీ విద్యార్థులు బైటాయించి ఆందోళనకు దిగారు.

సమయానికి బస్సులు లేక, ఆటోలలో వెళ్లలేక అవస్థలు పడుతున్నామని ఆవేధన వ్యక్తం చేశారు. విషయాన్ని ఆర్టీసీ డీపో మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించడం లేదని వాపోయారు. గ్రామానికి బస్సు నడిపించాలని డిమాండ్ చేశారు. సుమారు అరగంట పాటు విద్యార్థులు ఆందోళన చేపట్టడంతో తాండూరు – వికారాబాద్ మార్గంలో బస్సుల రాకపోకలకు అంతరాయంతో పాటు అటూ.. ఇటూ.. ట్రాఫిక్ జామ్ అయ్యింది.

విషయం తెలుసుకున్న పెద్దముల్ పోలీసులు సంఘటనా స్థలంకు చేరుకొని సముదాయించారు. కోట్‌పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడారు. ఆర్టీసీ డీఎంతో మాట్లాడి బస్సు వేయిస్తామని చెప్పడంతో విద్యార్థులు శాంతించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి….

ఆధార్ కేంద్రాల్లో ఉద్యోగాలు..!