వదినమ్మే.. చంపించింది…!
– ఇంటి ఆస్తి కోసం మరిధి హత్య
– రూ. 50 వేలకు నిందితులతో ఒప్పందం
– మర్డర్‌ను యాక్సిడెంట్‌గా మార్చేందుకు ప్లాన్
– 24 గంటల్లోనే వీడిన నవల్గాలో వ్యక్తి మర్డర్ మిస్టరీ
– వివరాలు వెల్లడించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటి స్థలం కోసం, పాత కక్షలను మనసులో పెట్టుకున్న ఓ వదినమ్మ తన మరదిని హత్య చేసేందుకు స్కెచ్ వేసింది. అతన్ని చంపేందుకు ఓ ముగ్గురితో రూ. 50వేలకు ఒప్పందం కుదుర్చుకుంది. అడ్వాన్స్ తీసుకున్న నిందితులు ఆమె మరదిని హత్య చేసి యాక్సిడెంట్‌గా మార్చేందుకు ప్లాన్ వేశారు. పోలీసుల విచారణలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం నవల్గా గ్రామ సమీపంలో జరిగిన వ్యక్తి హత్య కేసును మిస్టరీని పోలీసులు చేధించారు. బుధవారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తాండూరు రూరల్ సీఐ నగేష్, బషీరాబాద్ ఎస్ఐ శంకర్‌లతో కలిసి వివరాలను వెల్లడించారు.
నవల్గాకు చెందిన మాల మల్లమ్మకు మాల నర్సిములు, శ్యామప్ప (38), శ్యామమ్మ సంతానం. అయితే శ్యామప్ప భార్య నాలుగేళ్ల క్రితం భర్తను వదిలేసి కూతురును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి శ్యామప్ప తన చెల్లితో కలిసి ఉంటున్నాడు. అదే ఇంట్లోని రెండో భాగంలో అన్న నర్సిములు, వదిన సుగుణ నివసిస్తున్నారు. మరిదిని అంతమొందిస్తే ఇల్లు పూర్తిగా తమ సొంతం అవుతుందని సుగుణమ్మ భావించింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొత్త విజయ్, విశ్వనాథ్, మాల శివకుమార్‌లతో కలిసి వారం రోజుల క్రితం శ్యామప్ప హత్యకు పథకం వేసింది. అతన్ని చంపితే రూ.50 వేలు ఇస్తానని చెప్పి, శనివారం అడ్వాన్స్‌గా రూ.10 వేలు అందజేసింది.
గ్లౌజులు వేసుకుని.. గొంతు పిసికి
ఈ క్రమంలో సుపారీ తీసుకున్న ముగ్గురు శ్యామప్ప హత్యకు పక్కా ప్లాన్ వేశారు. సోమవారం సాయంత్రం బషీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో గ్లౌజ్‌లు తీసుకున్నారు. మద్యం తాగేందుకని రాత్రి శ్యామప్పను తీసుకుని గ్రామ శివారు తాతగుడి సమీపంలోని రాథోడ్ మోహన్ అనే వ్యక్తికి చెందిన పొలంలోకి వెళ్లారు. మద్యం తాగిన తర్వాత శ్యామప్పపై దాడి చేసి.. గొంతు పిసికారు. తరువాత తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పొలానికి ఆనుకుని ఉన్న బషీరాబాద్– తాండూరు ప్రధాన మార్గం వద్దకు ఈడ్చుకెళ్లి పడేశారు.
వదినమ్మపై అనుమానంతో..
హత్య వెలుగులోకి వచ్చిన తరువాత పోలీసులు మృతుని వదిన సుగుణమ్మపై అనుమానం పెరిగింది. వారితో పాటు ముగ్గురు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి స్థలం, పాత కక్షలతోనే ముగ్గురుతో కలిసి హత్య చేయించినట్లు నేరం అంగీకరించింది. ఈ మేరకు వదిన సుగుణమ్మ, నిందితులతో పాటు వారి సెల్ ఫోన్లను స్వాదీనం చేసుకున్నట్లు, కేసులోని నిందితులను రిమాండుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. హత్య జరిగిన 24 గంటల్లోనే కేసును చేధించినట్లు తెలిపారు. ఈ కేసు చేధనలో చురుగ్గా పనిచేసిన సీఐ, ఎస్ఐలతో పాటు సిబ్బందిని అభినందించారు. వారికి రివార్డులు అందించడం జరుగుతుందని తెలిపారు.
ఇదికూడా చదవండి…

