అడిగే దిక్కులేని అంగన్ వాడి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అడిగే దిక్కులేని అంగన్ వాడి..!
– 5 నెలలుగా విధులకు హాజరు కాని టీచర్
– 3 రోజులుగా అందుబాటులో లేని ఆయా
– ఇతర వ్యక్తులతో కేంద్రం నిర్వహణ
– తాండూరు రాజీవ్ కాలనీలో పరిస్థితి
తాండూరు, దర్శిని ప్రతినిధి : చిన్నారులకు విద్యనందించడంతో పాటు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు నిర్వహిస్తున్న అంగన్ వాడి కేంద్రంకు అడిగి దిక్కు లేకుండా పోయింది. తాండూరు పట్టణం రాజీవ్ కాలనీలోని అంగన్ వాడి కేంద్రంలో 5నెలలుగా టీచర్ విధుల్లోకి రావడం లేదు. అక్కడ పనిచేస్తున్న ఆయా కూడా సొంత పనుల నిమిత్తం ఇతరులను విధుల్లో ఉంచి అందుబాటులో లేకుండా పోయారు. రాజీవ్ కాలనీలోని అంగన్ వాడి కేంద్రంలో దాదాపు 15 మంది చిన్నారులు చదువుకుంటున్నారు.

అనురాధ అనే మహిళ అంగన్ వాడి టీచర్ గా పనిచేసేది. గత ఎంపీ ఎన్నికల నుంచి ఆమె విధుల్లోకి రావడం లేదు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న అనురాధకు ఐసీడీఎస్ అధికారులు ఇప్పటికే మూడు సార్లు నోటీసులు కూడా ఇచ్చారు. అయినా కూడా ఆమె విధుల్లోకి రావడం లేదు. ఇదే కేంద్రంలో పనిచేస్తున్న ఆయా చిన్నారులకు భోజనం అందించడం, ఇతర చిన్న చిన్న పనులు చేస్తూ వస్తున్నారు. అయితే వారి ఇంటికి సంబంధించి పెండ్లి కార్యక్రమాలు ఉండడంతో ఆమె మరోకరిని విధుల్లో ఉంచి వెళ్లిపోయారు.

మూడు రోజులుగా ఇతర వ్యక్తులు అంగన్ వాడి కేంద్రంలో నిర్వహణ చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న 15 మంది చిన్నారులకు చాలి చాలనీ భోజనం వడ్డిస్తున్నట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు అంగన్ వాడి కేంద్రం నిర్వహణపై సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 5 నెలలుగా టీచర్ రాకపోయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అడిగే దిక్కు ఎవ్వరు లేకపోవడంతో స్థానిక చిన్నారులకు. గర్భిణీ, బాలింతలకు అంగన్ వాడి సేవల్లో ఇబ్బందులు ఎదువురవుతున్నాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, స్థానిక అధికారులు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

ఇదికూడా చదవండి…

శంకర్ ‘అన్న’ దానంకు అశేష ఆదరణ..!