పాలిటిక్స్ అండర్ ప్రెషర్…!
– రాజకీయాల్లో ఒత్తిళ్లదే పై ‘చేయి’
– బలగం కోసం తలొ్గ్గుతున్న నేతలు
– వ్యవస్థకే నష్టమంటున్న విశ్లేషకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాజకీయాల్లో ఒత్తిళ్లు కామన్. అవి లేనిదే నేతల మనుగడ ప్రశ్నార్థకమే. అధికార, ప్రతిపక్ష పార్టీలే కాకుండా అన్ని పార్టీలలో గల్లీ నుంచి ఢీల్లీ దాకా ఎంత పెద్ద నాయకుడైనా తన బలగం కోసం తలొగ్గాల్సిన పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఇందులో కొన్ని మంచి సందర్భాలు ఉంటాయి. మరిన్ని వ్యవస్థకు చేటు చేస్తాయి. పెద్ద నేతకు ఎలాంటి సంబంధం లేకున్నా వారి కింద ఉన్న స్వార్థ రాజకీయాల ఒత్తిళ్లతో చేసే పనుల వల్ల వ్యవస్థకు ఎంతో చేటు చేస్తాయని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల రాజకీయాలు తమదైన పంథాలో కొనసాగుతున్నాయి.

ఆయా పార్టీలలో బడా బడా నేతలు చక్రం తిప్పుతున్నారు. ఆయా పార్టీలకు ఎలాంటి స్వార్థం లేకుండా కొంత మంది నాయకులు, కార్యకర్తలు పనిచేస్తుంటే.. మరికొందరు స్వార్థం కోసం.. తమ పనులు, వ్యాపారాలకు ఎలాంటి ఆంటకాలు రాకుండా ఉండేందుకు రాజకీయాలను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుతుంటారని విమర్శలు చేయడం వింటూనే ఉంటాం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి విమర్శలు అధికంగా వినిపిస్తున్నాయి. పల్లె.. పట్టణం దాకా ఇలాంటి విమర్శలకు కొదవ లేకుండా పోయింది. బడా నేతల అండతో ఎలాంటి పనులైనా చేసుకుంటూ కిందిస్థాయిలోని నేతలు పెద్ద పెత్తనం సాగిస్తుంటారని ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలోని ఓ గ్రామంలో ఇటీవలే సీసీ రోడ్డు పనులు జరిగాయి. ఇందులో ఎలాంటి నాణత్య ప్రమాణాలు పాటించకుండా పూర్తి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో అధికారుల వద్దకు ఫిర్యాదులు వెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఒత్తిళ్లు జరుగుతున్నాయని పలువురు అధికారులు బాహాటంగానే పేర్కొంటున్నారని పలువురు వాపోతున్నారు.

ఓ మండలంలో అధికారినే బురిడి కొట్టించి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడ్డారు అక్రమార్కులు. దీనిపై సదరు అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్దమయ్యారు. వెంటనే స్వార్థ పరులు బడా నేతలను ఆశ్రయించడంతో రాజకీయ ఒత్తిళ్ల వల్ల అధికారి వెనకంజ వేసినట్లు పుకార్లు రావడం గమనార్హం. ఇక పట్టణంలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు జరిగినా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయా శాఖలో పెదవి విరుపు విమర్శలు వినిపిస్తున్నాయి. చిరు వ్యాపారి.. రోడ్డును ఆక్రమించినా తొలగించని పరిస్థితి ఏర్పడింది. చిరు వ్యాపారి వద్దకు వెళ్లినా.. పేరున్న వ్యాపారి వద్దకు వెళ్లినా ఒత్తిళ్లే వెంటాడుతున్నాయని అధికారులు పేర్కొంటుండం విశేశం. ఇలాంటి పరిణాలు ఎన్నోన్నో కనిపిస్తున్నాయి. పార్టీలను నడుపుతున్న నాయకులు మంచితనంతో ముందుకు సాగుతుంటే వారి బలగం చేసే ఒత్తిళ్లకు తలొగ్గాల్సి రావడం వ్యవస్థకు ప్రమాదం జరిగే పరిణామాలే అధికంగా ఉంటాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోజు ఓ ఆక్రమాలపై అండగా నిలుస్తే.. భవిష్యత్తులో అనర్థాలే జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ అనుచరుల కోసం కాకుండా సమాజానికి మంచి జరిగే పనులకు.. భావితరాలకు ఆదర్శంగా నిలిచేలా నాయకులు నడుచుకుంటే మంచిదని హితవు పలువుకుతున్నారు. మరోవైపు నాయకులకు అభివృద్ధితో ప్రజా సేవా చేయాలో.. లేక ఒత్తిళ్ల రాజకీయాలతో ఎవరికి న్యాయం చేయాలో అని మనోవేధనకు గురికాక తప్పడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వారు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తును నిర్దారిస్తాయని భావించడంలో మన తప్పేమిలేదు.

ఇదికూడా చదవండి…

