తాండూరులో తైబజార్ క్లోజ్…!
– రద్దు చేయాలని ఎమ్మెల్యే ఆదేశం
– వసూళ్లు నిలిపివేయాలని నిర్ణయం
– వీధి వ్యాపారులకు ఊరట
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో వీధి వ్యాపారుల నుంచి ఫీజులు వసూలు చేసేందుకు ప్రవేశ పెట్టిన తైబజార్ను ఎత్తివేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశాలతో తైబజార్ ను రద్దు చేసేందుకు అధికారులు దిగివస్తున్నారు. తాండూరు మున్సిపల్ పరిధిలో సుమారు 12ఏండ్ల తరువాత తైబజార్ ఫీజుల వసూళ్లు చేపట్టే విధానంను అమల్లోకి తెచ్చారు.

కొన్ని రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేళం నిర్వహించారు. ఈ వేలంలో పట్టణంకు చెందిన మోజమ్ అనే యువకుడు తైబజార్ ఫీజులను వసూలు చేసేందుకు రూ. 10లక్షల 21వేలు పాడి వేలం దక్కించుకున్నారు. అయితే ఫీజుల వసూలలో రూ. 20 నుంచి రూ. 100లకు పైగా ధరలను నిర్ణయించడంతో వీధి వ్యాపారులపై ఆర్థిక భారం పడింది. ఈ క్రమంలో తైబజార్ ఫీజుల వసూళ్లపై వ్యాపారులు, ప్రజలు, పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఈ విషయం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వద్దకు చేరుకోవడంతో వెంటనే తైబజార్ను రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో అధికారులు తైబజార్ ఫీజుల వసూళ్లను రద్దు చేసేందుకు నిర్ణయించారు. పట్టణంలో తైబజార్ ఎత్తివేయడం పట్ల వీధి వ్యాపారులకు ఊరట లభించనుంది. ఈ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదికూడా చదవండి…

