తాండూరు నడిబొడ్డున ట్రాఫిక్ ఆంక్షలు
– ఆ ప్రాంతం నలువైపులా రాకపోకలు బంద్
– బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ నడిబొడ్డున ట్రాఫిక్ ఆంక్షలు విధించబడ్డాయి. కొన్ని రోజుల పాటు ఆ ప్రాంతంలో ఈ ఆంక్షలు కొనసాగుతాయి. తాండూరు పట్టణ నడిబొడ్డు అనగానే గుర్తుకొచ్చేది భద్రేశ్వర దేవాలయం. ప్రస్తుతం భద్రేశ్వర జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి రథోత్సవం, ఆదివారం తెల్లవారు జామున లంకాదహన వేడుకలు నిర్వహించారు.

ఈ ప్రధాన ఘట్టాలు ముగిసిన వెంబడే జాతరలో చిన్నపిల్లల ఆటవస్తువులు, స్వీటు షాపులు, వివిధ రకాల దుకాణాలు వెలుస్తాయి. అంతేకాకుండా జాతర సందర్భంగా భద్రేశ్వరున్ని దర్శించుకునేందుకు భక్తులు వెలాదిగా తరలివస్తారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని భద్రేశ్వర దేవాలయానికి చేరుకునే మార్గాలలో బైకులు, ఇతర వాహనాలు రాకుండా పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు.

జాతర ఉత్సవాలు పూర్తిగా ముగిసే వరకు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వాహనదారులు గమనించి సహకరించాలని పోలీసులు, దేవాలయ కమిటి సభ్యులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి….

