వామ్మో.. ఎర్ర రాయి దొంగలు..!

క్రైం రాజకీయం వికారాబాద్

వామ్మో.. ఎర్ర రాయి దొంగలు..!
– అక్రమంగా ఖనిజం దోపిడి
– కర్ణాటక ట్రాక్టర్లతో రవాణా
– కొరడా జులిపిన టాస్క్ ఫోర్స్‌
– 5ట్రాక్టర్లు, 2జేసీబీలు సీజ్, 7గురు డ్రైవర్లపై కేసులు
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : ఎర్ర రాయి దొంగలు రెచ్చిపోయారు. ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో ఖనిజనాలను దోపిడికి తెగబడ్డారు. గుట్టుగా సాగిస్తున్న రవాణాపై వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా జులిపించారు. ఈ సంఘటన పెద్దేముల్ మండలంలో చోటు చేసుకుంది.
kvcs
జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ అన్వర్ పాష తెలిపిన వివరాల ప్రకారం… పెద్దేముల్ మండల పరిధి పాషాపూర్ తాండా, తట్టేపల్లి పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసైన్డ్ భూముల్లో ఎర్ర రాయి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్ర రాయిని తవ్వేస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా ఉంచారు. శుక్రవారం తవ్వకాలపై దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో ఐదు ట్రాక్టర్లను, రెండు జేసీబీలను సీజ్ చేశారు. తవ్వకాలు, రవాణా చేస్తున్న 7 మంది డ్రైవర్లను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పెద్దేముల్ పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేశారు. అసైన్డ్ భూముల్లో ఎర్ర రాయి తవ్వకాలు చేపట్టి కర్ణాటక ప్రాంతాలకు తరలిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ దాడుల్లో గుర్తించారు. దాడుల్లో పట్టుబడిన వారిలో పెద్దేముల్ మండల పరిధి నిందితులతో పాటు కర్ణాటక వాసులు ఉన్నట్లు తెలిసింది. ఈ సంఘటనపై వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సీరీయస్ వార్నింగ్ ఇచ్చారు. ఎంతటి వారైనా సరే అనుమతులు లేకుండా ఖనిజాలను తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి..

హిందూ ఉత్సవ సమితికి మంచిరోజు..!