గొల్ల చెరువు కబ్జాలపై ఎన్‌జీటీలో దావా
– ప్రతివాదులుగా సబ్ కలెక్టర్, పలు శాఖల అధికారులు
– టీసీడబ్ల్యూఎస్ అధ్యక్షులు రాజ్ గోపాల్ సార్డా పిటిషన్
– ఫిటిషన్‌లో ప్రస్తావించిన అంశాలు ఏమున్నాయంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఏకైక జలాశయం గొల్ల చెరువు అన్యాక్రాంతంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్‌జీటీ)లో దావా నమోదయ్యింది. తాండూరు సిటీజన్స్ వెల్ఫేర్ సోసైటీ(టీసీడబ్ల్యూఎస్) అధ్యక్షులు రాజ్ గోపాల్ సార్డా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తాండూరులోని గొల్ల చెరువు అన్యాక్రాంతం, కుంచించుకు పోతున్న అంశాలను ప్రస్తావించారు.

అదేవిధంగా తాండూరు సబ్ కలెక్టర్, ఇరిగేషన్, తహసీల్దార్లు, పురపాలక సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ప్రతివాదులుగా చేర్చినట్లు రాజ్ గోపాల్ సార్డా గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో పాటు గొల్ల చెరువులో కబ్జాలను తొలంగించే వీలు కాని పక్షంలో పట్టణంలో ఇదివరకే ఉన్న పాతకుంట, గొల్ల చెరువుల సమానమైన కృతిమ సరస్సు ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని చెప్పారు.

అంతేకాకుండా గొల్ల చెరువు, మల్ రెడ్డిపల్లి చెరువుల్లో మురుగు నీరు ప్రవహించకుండా అడ్డుకట్ట వేయాలని, గొల్ల చెరువు బఫర్ జోన్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి కట్టడాలు అనుమతించరాదని, డంపింగ్ ను కూడా అరికట్టాలని కోరినట్లు తెలిపారు. గొల్ల చెరువు, మల్ రెడ్డిపల్లి చెరువుల్లో మిషన్ కాకతీయ ద్వారా 3 నుంచి 5 ఫీట్ల వరకు పూడిక తీయించి.. సారవంతమైన మట్టిని పొలాల్లో వెదజల్లేలా చూడాలని కోరడం జరిగిందన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై భారీ జరిమానాలు విధించాలని కోరినట్లు వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

