ఏడుపు ఆపడం.. తరం కాలే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఏడుపు ఆపడం.. తరం కాలే..!
– పరిహారమే వాళ్ల జీతం అనుకుందునా..
– ఆక్కా చెల్లెళ్ల తండ్రి ఆవేదన వర్ణణాతీతం
– ఎల్లయ్యను ఓదార్చిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– కుటుంబానికి పరిహారం చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : మూడు రోజుల క్రితం మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు అక్కా చెల్లెళ్ల తండ్రి ఏడుపును ఆపడం ఎవరి తరం కాలేదు. మరణానికి ముందు వారి చేసిన టాటా.. బైబై… భుజం తట్టి చెప్పిన ధైర్యాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీరు మున్నీరు అయ్యాడు. పరిహారం అందించేందుకు వచ్చిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సైతం ఎల్లయ్య గౌడ్ ఏడుపు ఆపడం సాధ్యం కాలేదు.

యాలాల మండలం పేర్కంపల్లి గ్రామానికి చెందిన ఎల్లయ్య గౌడ్ కూతుళ్లు తనూష, సాయిప్రియ, నందినిలు మూడు రోజుల క్రితం చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఒకేసారి మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో మృతి చెందిన వారితో పాటు ముగ్గురు అక్కా చెలెళ్లకు రూ. 7లక్షల చొప్పున రూ.21లక్షల పరిహారం ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కంపల్లి గ్రామానికి చేరుకున్నారు.
kvcs
అక్కా చెల్లెళ్ల తండ్రి ఎల్లయ్యగౌడ్ ను పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం అందజేసిన చెక్కులను అందించే సమయంలో తండ్రి ఎల్లయ్య గౌడ్ బోరున విలపించారు. ఉద్యోగం చేసి సంపాదించి ఇస్తామని చెప్పిన కూతుళ్ల మాటలు గుర్తు చేస్తూ.. ఇప్పడు చనిపోవడంతో వచ్చిన పరిహారాన్నే వాళ్లు ఇచ్చే జీతం అనుకుందునా అంటూ కన్నీరు మున్నీరు అయ్యారు. ఎల్లయ్యను ఓదార్చడం పక్కనే ఉన్న ఎమ్మెల్యే వల్ల కాలేదు. అయినప్పటికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎల్లయ్య గౌడ్ కు ధైర్యం చెప్పారు. కుటుంబానికి అండగా ఉంటామని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేస్తాం